ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయి 10రోజులు అవుతున్నా పవన్ తన మౌన ముద్రను వీడకపోవడం పవన్ అభిమానులకు కూడ అర్ధం కాని విషయంగా మారింది. సాధారణంగా ఎన్నికల తరువాత ప్రధాన రాజకీయ పార్టీ నేతలు అంతా మీడియా ముందుకు వచ్చి ఓటింగ్ సరళి పై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. 

ఆంద్రప్రదేశ్ ఎన్నికలలో ఈవీయం ఓటింగ్ మిషన్ ల సహాయ నిరాకరణ పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈవిషయం పై  ఒక్క మాట కూడ పవన్ నోటి వెంట రాకపోవడం వెనుక కారణం ఏమిటి అంటూ నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. 

అంతేకాదు ఎన్నికలు జరిగిన ప్రాంతాల నుండి అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ‘జనసేన’ కు గోదావరి జిల్లాలు ఉత్తరాంద్ర జిల్లాలలో 15 నుండి 20 శాతం వరకు ఓట్లు పడిన విషయం బయటపడింది అంటూ ఆప్రముఖ ఛానల్ పేర్కొనడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో ఎన్నికల తరువాత అధికారాన్ని ఆశిస్తున్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో ఏ పార్టీ ఓట్లకు పవన్ ‘జనసేన’ వల్ల గండిపడిందో తెలియక ఆ పార్టీలలోని ప్రముఖ నాయకులు కూడ ‘జనసేన’ ప్రభావం పై ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నట్లు ఆ ఛానల్ తన కథనంలో పేర్కొంది. 

దీనితో ఎన్నికల ఫలితాలలో పవన్ కు ఎన్ని సీట్లు వస్తాయో అన్న చర్చల కంటే ఎవరూ ఊహించని ‘జనసేన’ నిశ్శబ్ద విప్లవం పై ప్రధాన రాజకీయ పార్టీలలో గుబులు బయలుదేరింది అంటూ ప్రసారం కాబడ్డ ఆకథనం పవన్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చి తీరుతుంది. అయితే ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నప్పటికీ పవన్ ఎవరికీ అందుబాటులో లేకుండా కొనసాగిస్తున్న మౌనవ్రతం తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు కూడ అంతుచిక్కడం లేదు అంటూ ఆ న్యూస్ ఛానల్ తన విశ్లేషణలో పేర్కొనడంతో ఈనిశ్శబ్ద విప్లవం పై పవన్ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: