టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ లకు ఉన్నంత అభిమానుల సంఖ్య మరి ఏటాప్ హీరోకు లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరి కోసం మెగా అభిమానులు చేసే హడావిడి చూస్తే ఎవరైనా వీరిద్దరిలో ఎవరు రాజకీయాలలోకి  వచ్చినా ప్రజలు బ్రహ్మరధం పడతారు అంటూ చాల సంవత్సరాలు భ్రమించారు.

అయితే వీరిద్దరూ కేవలం ఒక దశాబ్ద కాలం మధ్య 2009-2019ల మధ్య జనం చేత రెండు సార్లు తిరస్కరింప బడటం ఆశ్చర్యంగా మారింది. చిరంజీవి ప్రజారాజ్యానికి కనీస స్థాయిలో అయినా సీట్లు ఇచ్చిన ఓటర్లు ఏకంగా పవన్ కళ్యాణ్ ను కనీసం ఎమ్.ఎల్.ఎ. గా అయినా అవ్వడానికి కూడ సహకరించకపోవడానికి వెనుక గల కారణం రాంగ్ టైమ్ ఎంట్రీ అంటున్నారు.

2009లో చిరంజీవి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ చేతిలో ఓడిపోతే 2019లో పవన్ కళ్యాణ్ రాజన్న కొడుకు జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలిలో కొట్టుకు పోవడం యాదృశ్చికమే కాకుండా వీరిద్దరూ అనుకోకుండా చేసిన వ్యూహాత్మకమైన రాంగ్ టైమ్ ఎంట్రీ అన్న కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ గత సంవత్సర కాలంగా ప్రజా సంకల్ప యాత్రతో జనం మధ్య మమేకం అయిపోతే ఆ స్థాయిలో పవన్ తన ప్రజాపోరాట మాత్రతో ప్రజలలో నమ్మకాన్ని కలిగించ లేకపోయాడు. 

అయినా పవన్ ‘జనసేన’ కు 20 లక్షల వరకు ఓట్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అయినా ‘జనసేన’ కు పడ్డ ఆ లక్షల ఓట్లు నిరుపయోగంగా మారాయి. అంతేకాదు ఆ 20 లక్షల ఓట్ల ప్రతినిధిగా కనీసం ‘జనసేన’ వాణిని అసెంబ్లీలో వినిపించే అవకాశం ప్రజలు పవన్ కు కలిగించకపోవడం మరింత ఆశ్చర్యంగా మారింది. దీనితో చిరంజీవి పవన్ లు ప్రజలకు తాము అవసరం లేని సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనవసరంగా తమ రాజకీయ భవిష్యత్ ను పాడుచేసుకున్నారా ? అంటూ కొందరు విశ్లేషకులు చేస్తున్న కామెంట్స్ ఈ మెగా బ్రదర్స్ ఇద్దరినీ అంతర్మధనంలో పడేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: