తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే మకుటం లేని మహరాజు అంటారు.  పునాధిరాళ్లు చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన ఆయన తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా స్వయంకృషితో పైకి వచ్చారు.  ఇండస్ట్రీలో అప్పటికే స్టార్ హీరోలుగా చక్రం తిప్పుతున్న ఎంతో మందితో పోటీ పడి మెగాస్టార్ గా ఎదిగారు.  తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు మూస పద్దతిలో సాగుతున్న డ్యాన్స్, ఫైట్స్ లో కొత్తదనం తీసుకు వచ్చి తనకు సాటి ఎవరూ లేరనిపించు కున్నారు మెగాస్టార్ చిరంజీవి. 

శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కొంత కాలం రాజకీయాల్లో కొనసాగారు.  రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన ఎన్నో సార్లు ఇండస్ట్రీకి దూరమైనందుకు బాధ అనిపిస్తుందన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  దాదాపు ఏనిమిదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంతో మళ్లీ తెరపై తన సత్తా ఏంటో చూపించారు.  బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి.  ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. 

బ్రిటీష్ సైన్యాన్ని గడ గడలాడించిన మొదటి తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.  అయితే మెగాస్టార్ చిరంజీవికి  హైదరాబాద్‌ లోని ‘శబ్దాలయా’ డబ్బింగ్ స్టూడియో అంటే ఎంతో సెంటిమెంట్ అని అంటారు..ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇక్కడే డబ్బింగ్ కార్య క్రమాలు జరుపుకున్నాయి. 

ఈ నేపథ్యంలో శబ్దాలయ స్టూడియోలో సోమవారం నుంచి చిరంజీవి డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు.  గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఈ చారిత్రక చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.  నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: పరుచూరి బ్రదర్స్‌, కెమెరా: రత్నవేలు, సంగీత దర్శకుడు: అమిత్‌ త్రివేదీ.


మరింత సమాచారం తెలుసుకోండి: