సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం మిక్డ్స్ టాక్, యావరేజ్ రేటింగ్స్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. సమ్మర్ హాలిడేస్ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయి. అదీ గాక ఈ  సినిమాకి టికెట్ రేటు కూడా పెంచడంతో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం 5వ వారంలో అడుగు పెట్టిన ఈ మూవీ రూ. 100 కోట్లుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.

 

ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. తొలిసారిగా 'మహర్షి' మూవీతో సూపర్ స్టార్ ఈ ఫీట్ సాధించగలిగారు. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండటం గమనార్హం.మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం. 150' సినిమా ద్వారా నెలకొల్పిన రూ. 102 కోట్ల రికార్డుకు మహేష్ బాబు ‘మహర్షి' చేరువైంది. త్వరలోనే మెగా రికార్డ్ బద్దలవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

 

రూ. 100 కోట్ల షేర్ క్రాస్ అవ్వడం ద్వారా ప్రస్తుతం ‘మహర్షి' టాప్ షేర్ వసూలు చేసిన టాలీవుడ్ చిత్రాల్లో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. రేపో మాపో ‘ఖైదీ నెం.150' రికార్డును బద్దలు కొట్టిన 4వ స్థానంలోకి ఎగబాకనుంది. అయితే 3వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ రంగస్థలం (రూ. 120 కోట్ల షేర్) రికార్డును దాటే ఛాన్స్ అయితే లేదు. మొదటి రెండు స్థానాల్లో బాహుబలి 2, బాహుబలి ఉన్న సంగతి తెలిసిందే.

 

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి లు ఈ చిత్రాన్ని నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: