ముందు నుంచీ విభిన్నమైన పాత్రలతోనే ప్రయాణం  సాగిస్తోంది నివేదా థామస్‌. ‘నిన్ను కోరి’, ‘జెంటిల్‌మన్‌’, ‘జై లవకుశ’, ‘118’ చిత్రాలతో ఆమెకు మంచి విజయాలూ దక్కాయి. ఇప్పుడు ‘బ్రోచేవారెవరురా’లో కథానాయికగా మెరిసింది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 28న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నివేదా విలేకర్లతో మాట్లాడింది. ఆ వివరాలివి...

 

'బ్రోచేవారెవరురా’ ఓ విభిన్నమైన కథ. సమాజానికి అద్దం పడుతుంది. మన చుట్టూ రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వాళ్లంతా ఎప్పుడెలా స్పందిస్తుంటారు? అనే  అంశాలకి ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర పేరు మిత్ర. దృఢమైన ఆలోచనలూ, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. నాకు, నా తండ్రి పాత్రకూ మధ్య సాగే సన్నివేశాలు కదిలిస్తాయి.

 

తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించాను. ‘జెంటిల్‌మన్‌’తో తెలుగులోనూ బిజీ అయ్యాను. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే రెండు భాషల్లోనూ నటిస్తున్నాను. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నా. ‘జెంటిల్‌మన్‌’లోనే డబ్బింగ్‌ చెప్పాలనుకున్నాను. అప్పుడు నాకు పరీక్షలున్నందున వీలుపడలేదు. ‘118’కి డబ్బింగ్‌ చెప్పాను.

 

‘‘ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘వి’లో చేస్తున్నాను. ‘శ్వాస’ అనే చిత్రంలోనూ నటిస్తున్నా. తమిళంలో కమల్‌ హాసన్‌తో చేసిన ‘పాపనాశం’ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. రజనీకాంత్‌ సినిమా ‘దర్బార్‌’లో చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా గురించి నేనుగా ఏదీ చెప్పలేను... అని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: