"వృత్తిరీత్యా నేను వైద్యుణ్ణి. మనోవృత్తిరీత్యా నేను నటుణ్ణి. కొంతమందికి ఆటలు ఆడటం, సినిమాలు చూడటం హాబీ. నాకు సినిమాలు చేయడం హాబీ. ఆత్మ సంతృప్తి కోసం సినిమాలు చేస్తున్నా. నాలోని నటుణ్ణి సంతృప్తి పరిచేందుకు దర్శకత్వం, నిర్మాణం చేపడుతున్నా" అని హరినాథ్‌ పొలిచెర్ల అన్నారు.

 

ఆయన హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’. ఎ జవాన్‌ స్టోరీ... అనేది ఉపశీర్షిక. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. హరినాథ్‌ పొలిచెర్ల మాట్లాడుతూ ‘‘రక్షణ దళాల్లో కోవర్టు ఆపరేషన్స్‌ ఎలా ఉంటాయనే కథతో రూపొందిన చిత్రమిది. అభినందన్‌ వర్ధమాన్‌ ఇటీవల పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లడం, వెనక్కి రావడం తెలిసిందే.

 

ఆయన సర్జికల్‌ స్ట్రైక్‌లో పాల్గొన్నారు. దీనికి రెండేళ్ల ముందే నేను ఈ కథ రాసుకున్నా. ఆర్మీలో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ వెళ్లి, అక్కడ ఏం చేసి తిరిగొచ్చాననేది కథ. అభినందన్‌ ఘటనకు, మా కథకు సంబంధం లేదు. అన్ని కమర్షియల్‌ హంగులతో చిత్రాన్ని తెరకెక్కించా. మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని సహకారంతో ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

 

"ఈ సినిమా తర్వాత రజాకార్ల నేపథ్యంలో అబ్దుల్‌ రజాన్‌ నాజ్వి, అతని అనుచరులు చేసిన ఘోరాల వల్ల ఓ కుటుంబం ఎన్ని కష్టాలు పడిందన్న కథతో చారిత్రక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. దానికి నేను దర్శకత్వం వహించను. వేరే దర్శకుడి చేతిలో ఆ సినిమా పెడతా. నా జీవితంలో యాభై శాతాన్ని సినిమాలకు, యాభై శాతాన్ని వైద్యవృత్తికి కేటాయిస్తున్నా" అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: