సినిమాల్లో నటించాలని తపనతో ఉండే యువత ముందు చదువు పూర్తి చేసుకుని రావాలని, తాను అలాగే చేసి సినిమాల్లోకి వచ్చానని హీరో నిఖిల్‌ తెలిపారు. పరిశ్రమలో ఏదైనా ఇబ్బంది వస్తే చదువే వారికి దారి చూపిస్తుందని చెప్పారు. తన కొత్త సినిమా అర్జున్‌ సురవరంలో జర్నలిస్టు పాత్ర చేసినట్టు వివరించారు.

 

మంగళవారం భీమవరంలో రక్షదళ్‌ సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. అనంతరం జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి. నేను హైదరాబాది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గూగుల్‌లో కూడా వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను. సినిమాలపై ఇష్టంతో పరిశ్రమకు వచ్చాను.

 

దర్శకులు శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ సినిమాకు సెలక్షన్స్‌ జరుగుతుంటే వెళ్లాను. ఆయన నన్ను ఆ సినిమాలో స్టూడెంట్‌ పాత్రలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాకు నిజంగానే హ్యాపీడేస్‌ ప్రారంభమయ్యాయి. నేను నటించిన అన్ని సినిమాలు నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా కార్తీకేయ, స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

 

భీమవరం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఇక్కడ ప్రజల ఆప్యాయతలు నాకు ఎంతో నచ్చుతాయి. భీమవరం పరిసర ప్రాంతాలు ఎంతో అందమైనవి. నాతో సినిమాలు చేసిన సుధీర్‌ వర్మ, చందు పశ్చిమ గోదావరి జిల్లా వాసులే. ఈ జిల్లాకు చెందిన ప్రతిభ గల వారు సినిమా పరిశ్రమలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: