బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నటించిన ‘కబీర్‌ సింగ్‌’ సినిమా ఓ పక్క వసూళ్లతో దూసుకెళుతున్నప్పటికీ నెగిటివిటీ మాత్రం తప్పడం లేదు. ‘ ‘అర్జున్‌ రెడ్డి’ ఓ చెత్త సినిమా అనుకుంటే మళ్లీ దీనికి రీమేక్ కూడానా’ అంటూ ఇటీవల సెన్సార్‌ బోర్డు సభ్యురాలు వాణి త్రిపాఠి సినిమాపై ఫైరయ్యారు.

 

తాజాగా ముంబయికి చెందిన ప్రదీప్‌ గాడ్గే అనే పేరున్న సీనియర్‌ వైద్యుడు ఒకరు సినిమాను ప్రదర్శించడం ఆపాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖను సంప్రదించారు. సినిమాలో వైద్యులను తప్పుగా చూపించారని, వైద్యులు మద్యం సేవించి చికిత్స చేస్తారన్నట్లుగా చిత్రించారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

 

ఇప్పటికే వైద్యులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలున్నాయని, ఈ సినిమా ద్వారా వైద్య వృత్తిపైనే వేలెత్తి చూపే సమస్య వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్ముందు ఈ సినిమా మరెక్కడా ప్రదర్శించకూడదని డిమాండ్‌ చేశారు. త్వరలో చిత్రబృందంపై కేసు వేస్తానని హెచ్చరించారు.

 

సినిమా విడుదలైన వారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. మరోపక్క ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ అవుతోంది. కన్నడలోనూ తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు సినిమాలకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: