తెలుగు చిత్రపరిశ్రమలో నటిగానే కాకుండా దర్శకురాలిగానూ తనదైన ముద్రవేశారు విజయనిర్మల. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏడో ఏటనే బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఆమె చిన్నప్పుడు దాదాపు అన్ని మగవేషాలే వేశారు.

 

ఒక సందర్భంలో ఆమె "నేను ఏడో ఏటనే నటించడం మొదలు పెట్టాను. సి.పుల్లయ్య దర్శకత్వంలో ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో ఎస్‌.వరలక్ష్మి కథానాయిక. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుంటే ఏమీ తెలిసేది కాదు. అప్పుడు ఎక్కువగా రాత్రి పూట చిత్రీకరణ జరిగేది. నవ్వమంటే ఏడ్చేదాన్ని. ఏడ్వమంటే నవ్వేదాన్ని. నాకు చిన్నప్పుడు పూరీ పొటాటో అంటే బాగా ఇష్టం. అది తీసుకొచ్చిన నాకు కనపడేలా పెట్టేవారు. దాన్ని చూడగానే నవ్వొచ్చేది. అలా బాలనటిగా ఐదారు సినిమాల్లో నటించాను."

 

"చిన్నప్పుడు అన్నీ మగవేషాలే వచ్చేవి. కానీ, ‘భూ కైలాస్‌’లో మాత్రం సీతగా చేశా. ఆ తర్వాత ‘పాండురంగ మహత్మ్యం’లో పాండురంగడిగా నటించా. అసలు నేను నటించిన తొలి సినిమాలోనే చిన్నప్పటి రాజకుమారుడి వేషం వేశా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని." అని తనకు వీలు చిక్కినప్పుడల్లా తన బాల్యం గురించే చెప్పేది అని కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా...

 

"స్కూల్‌ వెళ్లేటప్పుడు అప్పు చేసి మరీ నాతోటి పిల్లలకు చాక్లెట్లు కొనిచ్చేదాన్ని. సాయంత్రం ఆ షాపు వాడు డబ్బుల కోసం మా ఇంటికి వచ్చేవాడు. దీంతో మా అమ్మ బాగా తిట్టేది. అదే నాన్న ఉంటే డబ్బులు ఇచ్చి పంపేవారు. మా ఇంట్లో అందరూ మగపిల్లలే. నేను ఒక్కదాన్నే ఆడపిల్ల కావడంతో గారాబంగా పెంచారు’’ అని తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకునేవారు విజయ నిర్మల.


మరింత సమాచారం తెలుసుకోండి: