ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తున్న సినిమా ‘ది లయన్ కింగ్’. యానిమేషన్ సినిమాలకు పెట్టింది పేరైన లెజెండరీ ‘డిస్నీ’ సంస్థ రూపొందించిన చిత్రమిది. ‘జంగిల్ బుక్’ తరహాలో జంతువుల మీద తీసిన వినోదాత్మక చిత్రమిది. మూడేళ్ల కిందట డిస్నీ నుంచే వచ్చిన ‘జంగిల్ బుక్’ ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే.

 

ఆ చిత్రాన్ని రూపొందించిన జాన్ ఫావ్రూనే ‘లయన్ కింగ్’ను కూడా తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీన్ని ఇండియాలో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆయా భాషల నుంచి పేరుమోసిన స్టార్లతో కీలక పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పించారు. ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది.

 

నాని, జగపతిబాబు, రవిశంకర్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు ఈ చిత్రంలో వివిధ పాత్రలకు గాత్రం అందించారు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ‘లయన్ కింగ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. అడవిని ఏలే రారాజు సింహం వయసు మీద పడి తన రాజ్య భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంది. తన వారసుడికి ఉపదేశం చేసి నిష్క్రమిస్తుంది. మరి చిన్నదిగా, బలహీనంగా ఉన్న యువ సింహం ఎలా బలపడి రాజ్యాన్ని నిలబెట్టిందన్న కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

 

ట్రైలర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలాగే కనిపిస్తోంది. రవిశంకర్, జగపతిబాబుల వాయిస్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐతే ప్రధాన పాత్రకు వాయిస్ ఇచ్చిన నాని మాటే ట్రైలర్లో వినిపించకపోవడం నిరాశ కలిగించే విషయం. ట్రైలర్లో నాని ముద్ర ఉండుంటే దాని కళే వేరుగా ఉండేదేమో. బ్రహ్మి, ఆలీల వాయిస్ కూడా ట్రైలర్లో వినిపంచలేదు. సస్పెన్స్ లాగా ఆపారేమో!


మరింత సమాచారం తెలుసుకోండి: