కారంపూరి క్రియేషన్స్‌, మైక్‌ మూవీస్‌ పతాకంపై సాయి రొనాక్‌, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై, సుశీల్‌ దర్శక నిర్మాతలుగా రూపొందిస్తున్న చిత్రం 'ప్రెజర్‌ కుక్కర్‌'. ఎ.అప్పిరెడ్డి మరో నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ను కథానాయకుడు సందీప్‌ కిషన్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుందని, సాహిత్యం విభిన్నంగా ఉందని చెప్పారు.

 

ప్రేక్షకులకు త్వరగా రీచ్‌ అయ్యేలా ఉందీ గీతమని, టైటిల్‌లాగానే సినిమా స్టోరీ కూడా డిఫరెంట్‌గా ఉందని విన్నానని, తప్పకుండా సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నానని చెప్పారు. దర్శక నిర్మాత సుజై మాట్లాడుతూ 'యువతకు మంచి మెసేజ్‌ ఉంది. కథకు తగ్గ సంగీతం కుదిరింది. ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ మంచి మ్యూజిక్‌ను అందించార'ని తెలిపారు.

 

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరికీ డిగ్రీ అవగానే ఇక్కడ జాబ్‌ చేయాలా? లేక ఫారిన్‌ వెళ్లాలా? అనే ఆలోచన వస్తుంది. అలాగే లైఫ్‌లో ప్రతి పనికీ ఓ ప్రెజర్‌ ఉంటుంది. అలా ఈ సినిమాలో హీరో ఆ ప్రెజర్‌ను ఎలా హ్యాండిల్‌ చేశారనేదే స్టోరీ. యూత్‌కి మంచి మెసేజ్‌లాంటి మూవీ. నటీ నటులందరూ నేచురల్‌గా పెర్ఫామెన్స్‌ చేశారు' అని పేర్కొన్నారు.

 

హీరో సాయి రొనాక్‌ మాట్లాడుతూ 'మొదట్లో చదివేటప్పుడు ఓ రకమైన ప్రెజర్‌ ఉంటుంది. ఇప్పుడు ఓ రకమైన ప్రెజర్‌ ఉంటుంది. అలాంటి ప్రెజర్స్‌ గురించే ఈ మూవీలో చూపించాం. అయితే యూఎస్‌ వెళ్ళడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. చాలా మంచి సబ్జెక్ట్‌ ఎంటర్‌టైనింగ్‌గా సెటైరికల్‌గా చెప్పాం' అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: