రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాహుబలి 2 స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక కాగా ఎన్టీయార్ కు హీరోయిన్ ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. 
 
సాధారణంగా రాజమౌళి సినిమాలంటే సినిమా మొదలైనప్పటినుండే ఫస్ట్ లుక్స్ వదులుతూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాల్ని రెట్టింపు చేస్తాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆగస్ట్ 15న విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరూ విప్లవ వీరులు కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నాడట రాజమౌళి. 
 
ఈ సినిమా కథ విషయానికే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఒకే కాలానికే చెందిన వారై ఇద్దరూ కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే ఫాంటసీ కథతో రాజమౌళి ఈ సినిమాను తీస్తున్నాడు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా 2020 జులై 30 వ తేదీన విడుదల కాబోతుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: