మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతుంది ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటించిన సాహో సినిమా. 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కొన్ని మేజర్ ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా వీకెండ్ వరకు టికెట్స్ అన్నీ సేల్ అయ్యాయి. భారీ బడ్జెట్ కావటంతో టికెట్ రేట్లు కూడా పెరిగినట్లు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేట్లు సాధారణంగానే ఉన్నాయని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా సాహో టికెట్ రేట్లు పెరగనట్లు సమాచారం. సాధారణ థియేటర్లలో మాత్రం ఏరియాను బట్టి కొన్ని చోట్ల 30 రుపాయలు, 50 రుపాయలు, 100 రుపాయలు పెరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రెండు వారాల పాటు పెంచిన టికెట్ రేట్లు అమలులో ఉంటాయని తెలుస్తోంది. 
 
గరిష్టంగా 100 రుపాయల వరకు పెరగటంతో సామాన్యులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 100 కోట్ల రుపాయలకు పైగా వసూలు చేస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఏడు వేల థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో సాహో సినిమా విడుదల కాబోతుంది. సాహో సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు సాహో కొత్త రికార్డులు సృష్టిస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 
 
300 కోట్ల రుపాయల దాకా థియెట్రికల్ బిజినెస్ చేసిన సాహో సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో కలిపి 150 కోట్ల రుపాయలకు అమ్ముడయ్యాయి. సాహో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు 100 కోట్ల రుపాయల లాభాన్ని అందించింది. సాహో సినిమా తరువాత ప్రభాస్ యువి క్రియేషన్స్ బ్యానర్లోనే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: