హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన రాక్షసి సినిమా తమిళంలో జులై 5 వ తేదీన విడుదలైంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలి పాత్రలో ఈ సినిమాలో జ్యోతిక నటించారు. విద్యా వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాల్ని ప్రశ్నిస్తూ, చదవని పిల్లల్ని దండించే టీచర్ పాత్రలో జ్యోతిక నటించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన మలేషియా విద్యా శాఖ మంత్రి మస్ జ్లీబిన్ మాలిక్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
మలేషియా విద్యా శాఖ మంత్రి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో " రెండు నెలల క్రితం రాక్షసి అనే సినిమా విడుదలైంది. నేను నిన్న రాత్రి తోటి అధికారులతో కలిసి ఈ చిత్రాన్ని చూసాను. ఈ సినిమాను చూసిన తరువాత స్వయంగా ఈ సినిమాపై రివ్యూ రాయాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలి. అద్భుతమైన కథతో ఈ సినిమాను తీసారు. జ్యోతిక తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది." 
 
" విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నాకు ఇలాంటి సినిమా చూడటం విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది. మలేషియా దేశంలోని పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాలో జ్యోతిక పాత్ర సూపర్ హీరో లాంటి క్యారక్టర్. విద్యా రంగంలో విజయం సాధించటానికి ఉన్న ఎన్నో పథకాలను గురించి ఈ సినిమాలో వివరించటం జరిగింది." 
 
"సినిమాలోని జ్యోతిక పాత్ర విద్యార్థులు బడి మానేయకుండా ఎంతో కష్టపడింది. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల చదువుల విషయంలో ఖచ్చితంగా ఉండాలని సినిమాలో వివరించారు. విద్యా వ్యవస్థలోని అన్ని కోణాల్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఓ సినిమాను గొప్పగా తీయటం విశేషం. ఈ సినిమాను చూడనివారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడాలి" అని మలేషియా విద్యా శాఖ మంత్రి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: