భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసి ఆలిండియా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న ఏకైక దక్షిణ భారత నటి శ్రీదేవి మాత్రమే. తెలుగు, తమిళ్ లో ఓ వెలుగు వెలిగాక హిందీలో అడుగుపెట్టిన ఆమె.. తన సమ్మోహనపరిచే అందంతో, అద్భుత నటనతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించి వారి ఆదరణ చూరగొంది. ఆమె అకాలమరణం చెంది ఏడాదిన్నర కావొస్తున్నా సినీ ప్రేక్షకులు ఆమెను మరచిపోలేదు. ప్రస్తుతం ఆమెకు ఒక అరుదైన గౌరవం దక్కింది.

 

 

 

అతిలోకసుందరి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ బుధవారం సింగపూర్ లో ఘనంగా జరిగింది. అక్కడి మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మైనపు బొమ్మలో.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దివి నుంచి దిగివచ్చిన దేవకన్య పాత్రలో నటించిన శ్రీదేవి.. మళ్లీ అదే దివి నుంచి దిగివచ్చి ఈ బొమ్మలో ఒదిగిపోయిందా అన్నట్టుంది. అతిలోకసుందరి అనే పేరుకు సార్ధక నామధేయురాలు శ్రీదేవి మాత్రమే అని మరోసారి అనిపించకమానదు. బంగారం రంగు దుస్తుల్లో తలపై కిరీటంతో శ్రీదేవి బొమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది. శ్రీదేవి నటించిన సూపర్ హిట్ హిందీ చిత్రం ‘మిస్టర్ ఇండియా’లోని హవా.. హవాయి పాట లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని మలిచారు నిర్వాహకులు. 

 

 

 

శ్రీదేవి దక్షిణాది చిత్రాల్లో నటించి తెచ్చుకున్న పేరుకు మించి బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. దేశంలోనే ఆమె పేరు మార్మోగిపోయింది. అమితాబ్, రజినీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, జితేంద్ర వంటి.. సూపర్ ప్టార్స్ సరసన నటించింది. శ్రీదేవి అకాలమరణాన్ని ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరన్నది నిజం. . మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతీయులకు ఈ నిర్వాహకులు కానుక ఇచ్చారనే చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: