రెండు రోజులుగా దేశంలో ప్రధానంగా చర్చల్లో ఉన్న విషయం ఏదైనా ఉందంటే అది చంద్రయాన్ 2 మాత్రమే. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ లో భాగంగా చివరి నిముషంలో విక్రమ్ ల్యాండర్ కు ఏర్పడిన సాంకేతిక సమస్య భారతీయులందరినీ ఆవేదనలో ముంచెత్తింది. ఈ ఆవేదన స్థాయి ఎంతో ఇస్రో చైర్మన్ శివన్ కంటతడే తెలియజెప్పింది. ప్రధాని మోదీ వద్ద ఆయన కన్నీటీ పర్యంతమైన తీరు, ప్రతిగా మోదీ ఆయన్ను అక్కున చేర్చుకుని భుజం చరుస్తూ ఓదార్చిన తీరు ప్రతిఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.

 


ఈ విషయంలో భారతీయులంతా ఒక్కతాటిపై నిలిచారు. ఇస్రోకు, చైర్మన్ శివన్ కు తమ సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీతో సహా ఎందరో భారతీయులు ఇస్రోకు భరోసానిచ్చారు. ఇలా స్పందించిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు ఎందరో ఉన్నారు. అయితే వీరిలో అనుష్క శర్మ, సోనమ్ కపూర్, మధుర్ బండార్కర్ ల స్పందనకు దేశ ప్రధాని మోదీ ముగ్దులయ్యారు. వీరంతా సోషల్ మీడియాలో ఇస్రో శాస్త్రవేత్తల కృషినీ, కష్టాన్ని గుర్తించి ‘మీ వెంట మేమున్నాం..’ అంటూ స్పందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వీరి ట్వీట్లకు రిప్లై ఇస్తూ ‘మీరంతా ఓ కుటుంబంలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం సంతోషించదగిన విషయం. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని, కష్టాన్ని ప్రతి భారతీయులందరూ గుర్తించారని.. ఇందుకు గర్వపడుతున్నా’నంటూ తన సందేశం పంపారు.

 


ఇంతటి భావోద్వేగ క్షణాలకు చంద్రయాన్ 2 వేదికయింది. భారతీయులంతా ఒకతాటిపై ఉంటారనేందుకు ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది. భూకేంద్రంతో విక్రమ్ కు కేవలం కమ్యునికేషన్ మాత్రమే మిస్ అయ్యాయని 95 శాతం విజయం సాధించామని శివన్ ఆరోజే ప్రకటించారు. అందుకు తగ్గట్టే విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభ్యమైందని కమ్యునికేషన్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామంటూ ఆయన ఆదివారం చేసిన ప్రకటన భారతీయుల్లో సంతోషాన్ని నింపింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: