వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్మీకి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ కు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిందీ చిత్రం. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ సంఘాలు పట్టుబడుతున్నాయి. షూటింగ్ స్పాట్ కి వెళ్లి కూడా తమ అభ్యంతరాలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. 

 

 

 

దీనిపై బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపిబోయ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశాయి. సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని, అప్పటి వరకూ సినిమా విడుదల వాయిదా వేసేలా అదేశాలివ్వాలని కోరాయి. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడడంతో తెలంగాణ హైకోర్టు ఈ అంశంపై స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి ఆర్ ఎస్ చౌహన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తాము స్పందించలేమని ఈ పిటిషన్ స్వీకరించటానికి నిరాకరించింది. దీనిపై ఎటువంటి అభ్యంతరాలున్నా సెన్సార్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

 

 

 

సినిమాల విషయంలో వివిధ వర్గాల నుంచి ఇటువంటి వివాదాలు తరచుగా జరుగుతున్నాయి. గతేడాది రంగస్థలం సినిమాలోని ఓ పాటలో సందర్భానుసారం వచ్చే 'గొల్లభామ..' అనే పదం మార్చాలని గొల్ల సంఘం సభ్యులు డిమాండ్ చేయడంతో 'గోరువంక'గా మార్చారు. ఇటువంటి సంధర్భాల్లో ఎటువంటి ఇబ్బందులున్నా సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికెటే అంతిమంగా ఉండేది. దాదాపు దశాబ్దం క్రితం పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన కొమరం పులి సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే వివాదం జరిగింది. ఇటువంటి ఉదంతాలెన్నో గతంలో జరిగాయి. మరి దీనిపై ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాల్సిందే. ఈనెల 20న వాల్మీకి సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: