మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ సినిమా ప్రమోషన్లలో తలమునకలై ఉన్నారు. కానీ ఈ సినిమాపై వివాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ సినిమాపై ఉయ్యాలవాడ కుటుంబీకులు కొందరు తెలంగాణ హైకోర్టులో పిల్ వేయడం చిత్ర యూనిట్ తో సహా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

 


ఉయ్యాలవాడ నాలుగో తరానికి చెందిన కొందరు తెలంగాణ హైకోర్టులో ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ నిలుపుదల చేయాలంటూ పిల్ వేశారు. సినిమాపై తమకున్న అభ్యంతరాల నివృత్తి కోసం తమకు ప్రత్యేక ప్రదర్శన వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిల్ వేశారు. ఇంకా.. గతేడాది రామ్ చరణ్ తమను కలిసి సినిమా కోసం తమ కుటుంబ చరిత్ర తీసుకున్నారని, ఇంట్లో కొంతమేర షూటింగ్ జరిపి కొన్ని వస్తువులు కూడా ఉపయోగించుకున్నారని కోర్టుకు విన్నవించుకున్నారు. సినిమా ఖర్చులో పదో వంతు తమకు రాయల్టీ కింద చెల్లిస్తామంటూ వాగ్దానం చేశారని ఉయ్యాలవాడ నాలుగోతరం కుటుంబీకుడు దొరవారి దస్తగిరి రెడ్డి ఈ మేరకు పిల్ లో పేర్కొన్నారు. మొదట్లో తమకు 25,000 ఇచ్చారని.. అప్పటినుంచి తమ ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావట్లేదని తమను నిర్మాత మోసం చేశాడని కోర్టుకు తెలిపారు.

 


దీనిపై హైకోర్టు న్యాయమూర్తి స్పందించి ఈనెల 26కు వాయిదా వేశారు. దీంతో సైరా సినిమా విషయం కొత్త మలుపు తీసుకుంది. ఓపక్క తామే ఉయ్యాలవాడ వారసులమంటూ కొంతమంది చిరంజీవిని కూడా కలిశారు. అంతా సద్దుమణుగుతోందని భావిస్తున్న తరుణంలో ఇలా కొందరు కోర్టుకెక్కడం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై కోర్టు ఏం తీర్పు ఇవ్వనుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: