టెంపర్ సినిమా నుండి వరుస హిట్లు కొడుతున్న జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి జూనియర్ ఎన్టీయార్ కాంబినేషన్లో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ యూనిట్ అధికారికంగా విడుదల చేయకపోయినా రామ్ చరణ్ కియారా అద్వానీని కలిసిన సమయంలో రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చింది. కానీ జూనియర్ ఎన్టీయార్ లుక్ మాత్రం ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఇలాంటి సమయంలో ఒక వస్త్రాల బ్రాండ్ ప్రకటనలో భాగంగా విడుదలైన ఎన్టీయార్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 
ఎన్టీయార్ ఈ ఫోటోల్లో బాగా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు బయట కనిపించని ఎన్టీయార్ కొత్త లుక్ తో ప్రకటనకు సంబంధించిన ఫోటోల్లో కనిపిస్తూ ఉండటంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ నెల 22వ తేదీన కొమరం భీం పుట్టినరోజు కాబట్టి ఆరోజు కొమరం భీం పాత్రలో ఎన్టీయార్ ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ నుండి ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 
 
ఈ సినిమా 2020 జులై 30వ తేదీన విడుదల కాబోతుంది. స్టార్ హీరోలైన ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. కొరటాల శివతో సినిమా పూర్తయిన తరువాత జూనియర్ ఎన్టీయార్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: