సినీనటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి క్లాసు తీసుకున్నారు.  హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సోమవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రంలో తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డవారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులతో పాటు పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.  

రాజేంద్రుడు తనదైన స్టైల్లో నవ్విస్తూనే.. తాగి బండ్లు నడిపితే కలిగే నష్టాలను కళ్లకుకట్టినట్టు వివరించారు. మద్యం తాగి వాహనం నడిపితే మీతోపాటు ఎదుటి వాళ్ల ప్రాణాలకు నష్టం కలుగుతుంది.. స్పీడ్ థ్రిల్లింగ్ ఉంటుందని హాలీవుడ్ సినిమాల్లో జాకీచాన్ చేసిన ఫీట్లను మనం చేద్దామనుకుంటే అది అజ్ఞానంతో కూడిన అమాయకమవుతుంది అని హెచ్చరించారు. 

తాగుబోతులకు తమపై తమకు నమ్మకం ఎక్కువని.. ఆ.. ఏం కాదులే.. బండి నడుపుతాంలే అనుకుంటారని.. కానీ రోడ్డుపైకి వచ్చి ఇతరుల ప్రాణాలకు హాని కల్గించే హక్కు మనకు లేదని రాజేంద్రుడు సున్నితంగా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమైనవని, ఈ రెండు అంశాలను వాహనదారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 

స్పీడ్ డ్రైవింగ్ పై కూడా రాజేంద్రప్రసాద్ క్లాస్ పీకారు.. ఎంత వేగంగా వెళ్లినా.. స్లోగా వెళ్లినా తేడా 5, 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదని.. ఆ మాత్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టాలా అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అంతకంటే ఎక్కువ తేడా ఉంటుందని నిరూపిస్తారా అంటూ తాగుబోతుకు రాజేంద్రప్రసాద్ ఛాలెంజ్ విసిరారు. తెలుగు రాష్ర్టాల్లో అత్యంత వెనుకబడిన గ్రామాల వివరాలు సేకరిస్తున్నామని... వాటిని దత్తత తీసుకునేలా తోటి హీరోలకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: