ఏపీ సీఎం చంద్రబాబు పొద్దున లేస్తే చాలు.. అమరావతి జపం అందుకుంటున్నారు.. నిత్యం రాజధాని నామస్మరణతోనే గడిపేస్తున్నారు.. మరోవైపు పట్టీసీమను యుద్ధ ప్రాతిపదికను పూర్తి  చేయిస్తున్నారు. చంద్రబాబు దృష్టి అంతా కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలు తప్పితే అటు ఉత్తరాంధ్రను కానీ.. ఇటు రాయలసీమను కానీ పట్టించుకోవడం లేదని విమర్శలు ఫుల్లుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయలసీమ నేతలు ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. 

రాయలసీమ కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్న నాయకులలో వైసీపీ నేత మైసూరా రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆయన కొంతకాలంగా వైసీపీలోనూ క్రియాశీలకంగా లేరు. వైసీపీలోనూ ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో సీమజనంలో ఉన్న అసంతృప్తికి అద్దం పట్టేలా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రఉద్యమం ప్రారంభిస్తే సక్సస్ కాగలమన్న ధైర్యం రాయలసీమ నేతల్లో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మైసూరారెడ్డి రాయలసీమకోసం పోరాడబోతున్నారంటూ మెట్రో ఇండియా అనే ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. ‘ఇక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం’ అన్న శీర్షికన మైసూరారెడ్డి ఇంటర్వ్యూనూ ప్రచురించింది. ఈ కథనం సహజంగానే పొలిటికల్ సర్కిల్లో సంచలనం సృష్టించింది. మైసూరా సీమ ఉద్యమం ప్రారంభిస్తారని అంతా అనుకుంటున్నా.. ఆయనే నేరుగా మీడియా ముందు చెప్పలేదు. 

మెట్రో ఇండియా కథనంతో మైసూరా రెడ్డి తన సీమ పోరాటాన్ని కన్ ఫామ్ చేసినట్టైంది. సహజంగా ఇలాంటి విషయాల్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే దాని పర్యవసనాలు ఆలోచించుకుంటారు. మరి ఇంతలో ఏమైందో.. తెలియదు కానీ.. అసలు తనను ఏ పత్రికా ఇంటర్వ్యూ చేయలేదని..  మెట్రో ఇండియా తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురించిన వార్తతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని మైసూరారెడ్డి ప్రకటించారు. 

సహజంగా ఏ పత్రికా ఏ నాయకుడినీ ఇంటర్వ్యూ చేయకుండా.. ఆయన్ను ఇంటర్వ్యూ చేసినట్టుగా కథనం ఇవ్వదు. అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే.. ఈ ఇంటర్వ్యూ చూసిన జగన్ మైసూరాకు గట్టిగా అక్షింతలు వేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో ఉంటూ అలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని.. కావాలంటే పార్టీ నుంచి బయటకు వెళ్లాక ఇచ్చుకోవచ్చని చెప్పిఉంటారని భావిస్తున్నారు. అందుకే మైసూరా అలాంటి ప్రటకన ఇచ్చారని అంటున్నారు. ఏదేమైనా మైసూరా వంటి నేత స్థాయికి ఇలాంటి దాగుడుమూతలు సరికాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: