ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తోంది. ఆ మధ్య కొన్ని రోజులు ప్రత్యేక హోదా అంటూ హడావిడి చేసినా ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉంటున్నారు. అడపాదడపా జనంలోకి వెళ్తున్నారు. ఆంధ్రాలోనూ పార్టీ పరిస్థితి అంత గొప్పగా కాకపోయినా.. తెలంగాణతో పోలిస్తే చాలా బెటర్. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా అంటూ ఉంది కదా.. కొన్నాళ్లాగితే అధికారం రాకపోతుందా అన్న ఆశ ఉంది. 

కానీ తెలంగాణలో వైసీపీ పరిస్థితి పరమ దారుణంగా ఉంది. గత వరంగల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ. చివరకు ఓ అనామక పార్టీ కూడా వైఎస్సార్ సీపీ కంటే ఐదారు వేల ఓట్లు ఎక్కువ తెచ్చుకుందంటే వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోనీ అలాగని జగన్ తెలంగాణ శాఖను పూర్తిగానూ వదిలేయడం లేదు. చివరకు జగన్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. 

ప్రస్తుతం తెలంగాణలో జంపింగ్ సీజన్ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బ్యాక్ గ్రౌండ్  కారణంగా కాంగ్రెస్, టీడీపీ నేతలు గులాబీ పార్టీలోకి క్యూకడుతున్నారు. ఎన్నాళ్ల నుంచో పార్టీని నమ్ముకున్న సాయన్న లాంటి వాళ్లు కూడా గులాబీ కండువా కప్పేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రీసెంటుగా జగన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యే హ్యాపీ ఇన్సిడెంట్ జరిగింది. అదే తెలంగాణ టీడీపీ నుంచి ఓ నాయకుడు తెలంగాణ వైసీపీలో చేరడం. 

వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వార్త వైసీపీ వారినే కాదు తెలంగాణలోని అన్ని పార్టీల వారిని ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణలో దాదాపు ఖతమైపోయిందని భావిస్తున్న వైసీపీలోకి సాంబయ్య ఎలాంటి ఫ్యూచర్ చూసుకుని వస్తున్నారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. 

బహుశా టీఆర్ఎస్ పార్టీ చేర్చుకోకపోవడం.. టీడీపీలో ఉండలేకపోవడం వల్ల... ఏదో ఒక పార్టీ ముందు మారాల్సిందే అని సాంబయ్య గట్టి పట్టుమీద ఉండి ఉండాలి. ఏదేమైనా ఇది వైసీపీ క్యాడర్ కు స్వీట్ షాక్ అని చెప్పుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: