ఆంధ్రాలో కాపు రిజర్వేషన్ పోరు ఉధృతమయ్యే ఛాన్స్ కనిపిస్తోందా.. రిజర్వేషన్ కోసం కాపుల పోరాటం క్రమంగా సెంటిమెంట్ గా మారుతోందా.. అది క్రమంగా బలపడి మహోద్యమంగా మారుతుందా.. ఇప్పుడు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి కాపులు అత్యధికంగా ఉండే తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇది బలంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తుంది.

ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు రిజర్వేషన్ ఆందోళన కారులు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాపు సంఘం నేత సోమవారం సాయంత్రం వరకూ జీవో జారీకి గడువు విధించారు.  ఆ తర్వాత తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. కుటుంబంతో సహా ఉద్యమంలో పాల్గొంటానన్నారు. 

ఈ కాపు ఉద్యమం సెంటిమెంట్ ప్రభావమో ఏమో కానీ.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సూరిబాబు అనే యువకుడు కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాపులకు రిజర్వేషన్ హోదా కల్పించాలని తన సుసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. స్థానికంగా ఓ మెకానిక్ గా ఇతడు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ కోసం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. లేఖలో రాశాడు. 

ప్రభుత్వం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని.. ఇకనైనా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సూరిబాబు తన లేఖలో పేర్కొన్నాడు. సూరిబాబు ఆత్మహత్య వార్త అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు కాపు నాయకుల్లోనూ అలజడి రేపుతోంది. ఇలా ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: