ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోజా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారా.. రోజా అంటే వ్యక్తిగతంగా భయంపెంచుకున్నారా.. రోజా విషయంలో మరీ ఓవర్ గా రియాక్టవుతున్నారా.. అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే విమర్శలతో మీడియా ముందుకు వచ్చారు. 

చంద్రబాబు రోజా అంటే భయపడిపోతున్నారు.. అనే ప్రచారాన్ని ఇటీవల వైసీపీ ఎక్కువగా చేస్తోంది. మొన్నటికి మొన్న అంబటి రాంబాబు అయితే రోజా పేరు చెబితే ఏకంగా చంద్రబాబు ప్యాంటు తడుపుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అదే తరహా విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజాను ఎదుర్కొనేందుకు అధికారపక్షం వేస్తున్న ఎత్తులను వారు తప్పుబడుతున్నారు. 

ప్రభుత్వంపై విపక్షం అవిశ్వాస తీర్మానం పెడితే కేవలం నాలుగు గంటలే చర్చకు కేటాయించారని.. గుర్తు చేసిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు.. అదే రోజా అంశంపై మాత్తం గంటల తరబడి చర్చ సాగిస్తున్నారని విమర్శించారు. చివరకు స్పీకర్ కోడెలపై అవిశ్వాసం పెట్టినా రెండు గంటలే కేటాయించారని గుర్తు చేశారు. ఒక మహిళా ఎమ్మెల్యే గురించి అసెంబ్లీలో గంటల తరబడి చర్చ సాగిస్తున్నారంటేనే.. ఆమెను బాబు ఎంతగా భయపడిపోతున్నారో అర్థమవుతోందంటున్నారు. 

ప్రజాసమస్యలను ఏమాత్రం పట్టించుకోని అధికార పక్షం ప్రివిలేజ్ కమిటీ నివేదికపై మాత్రం గంటలకు గంటలు చర్చిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కామెంట్ చేశారు. పార్టీ ఇతర ఎమ్మెల్యేలు రాజేశ్వరి, శ్రీవాణిలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై చర్చ విషయంలో తామంతా అసెంబ్లీలో గొడవ చేసినా.. కేవలం రోజానే టార్గెట్ చేశారంటే ఆమె అంటే బాబు ఎంతగా భయపడిపోతున్నారో ఇట్టే అర్థమవుతోందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: