ఎన్నికలంటేనే విమర్శలు, మాటల యుద్ధాలు, వ్యూహాలు, ఆరోపణలు.. అంతవరకూ ఓకే.. ఇవి ఎక్కడైనా ఉంటాయి. కానీ అవే ఎన్నికలను పర్సనల్ గొడవల్లా మార్చుకుంటే.. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి కెలుక్కుంటే.. జనరల్ గా ఇవి కాస్తో కూస్తో సంస్కారం ఉన్న వ్యక్తులు చేసేపనులు కావు. కానీ ప్రపంచానికే ప్రజాస్వామ్యానికి కొత్త అర్థాలు చెప్పామని ఫీలయ్యే అమెరికా ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. 

రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా ప్రెసిడెంట్ రేసులో పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌, టెడ్‌ క్రూస్ మధ్య పర్సనల్ విమర్శలు ఘోరంగా శ్రుతిమించాయి. చివరకు ఒకరి భార్యపై మరొకరు ఆరోపణలు చేసుకునే రేంజ్ కు దిగజారాయి. ఇందుకు వీరిద్దరూ ట్విట్టర్‌ ను వేదికగా చేసుకున్న తీరు విమర్సల పాలవుతోంది. అమెరికా పరువును బజారున పడేస్తోంది. 

ప్రెసిడెంట్ రేసులో ట్రంప్ కంటే వెనుకబడి ఉన్న టెడ్‌క్రూస్‌ వర్గానికి చెందిన కొందరు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా న్యూడ్ ఫోటోతో ఓ ప్రకటన విడుదల చేయడం ఈ వివాదానికి దారి తీసింది. దీనికి కౌంటర్ గా ట్రంప్ కూడా రెచ్చిపోవడంతో వివాదం ముదిరిపాకానపడింది. డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య ఓ ప్రముఖ మోడల్. ఆమె పేరు మెలానియా. ఆమె గతంలో ఒక పత్రికకు న్యూడ్ ఫోటో షూట్ ఇచ్చారు. 

దీన్నివాడుకుంటూ టెడ్ క్రూస్ వర్గం ఓ ప్రకటన రూపొందించింది. దీనిపై మండిపడిన డొనాల్డ్‌ ట్రంప్‌.. టెడ్‌ క్రూస్‌ భార్య హైడీ బండారం బయటపెడతానని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. అయితే ఇక్కడో ట్విస్టు ఉంది. ట్రంప్ భార్య న్యూడ్ ఫోటోతో వచ్చిన ప్రకటనకూ తనకూ ఏ సంబంధం లేదంటున్నాడు టెడ్ క్రూస్. అయితే అప్పటికే ట్రంప్ కు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. 

అందుకు రివెంజ్ తీర్చుకుంటూ తన భార్య మెలానియా, టెడ్‌ క్రూస్‌ భార్య హైడీ పక్క పక్కనే ఉన్నట్టుగా రూపొందించిన చిత్రాన్ని డొనాల్డ్‌ ట్రంప్ ట్విట్టర్‌లో పెట్టేశాడు. దీనికి కొటేషన్ యాడ్ చేశాడు.. రహస్యాలను బయటపెట్టాల్సిన పనిలేదని ఈ ఒక్క చిత్రం 1000 పదాలతో సమానమని కామెంట్ పెట్టాడు.  దీనిపై మళ్లీ టెడ్‌ క్రూస్‌ ఫైర్ అయ్యాడు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంత పిరికోడనుకోలేదని.. ప్రెసిడెంట్ వార్ లోకి పెళ్లాలను లాగుతాడని తాను ఊహించలేదని అన్నాడు. మొత్తానికి ప్రెసిడెంట్ వార్ ఇంత అగ్లీగా మారడం తాము ఎన్నడూ చూడలేదంటున్నారు అమెరికన్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: