తెలుగు రాష్ట్రాలు  విభజన తర్వాత రాజకీయ పరిస్థితులు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణలో టీడీపి, కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతుంటే..అటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ టీడీపీ నుంచి దాదాపు అందరూ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.  ఇక కాంగ్రెస్ నుంచి కూడా ముఖ్య నేతలు టీఆర్ఎస్ లోకి వలస రావడం మొదలైంది. ఈ మద్య నల్లగొండలో ఎప్పటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతూ వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్ ఉప ఎన్నికలో పోటీ పెట్టొద్దని జానారెడ్డికి చెప్పినా వినలేదని ఆయన అన్నారు. అంతేకాక ఎప్పుడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీలో ఘోరంగా ఓడిపోయామని ఆయన అన్నారు. పాలేరులో రాంరెడ్డి సతీమణిని పీసీసీ పట్టించుకోలేదని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితులపై పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాస్తానని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని, లేకుంటే మనుగడ కష్టమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తికి పీసీసీ చీఫ్‌ ఇస్తే బాగుండేదిని ఆయన అభిప్రాయ పడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్‌పై సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు పీసీసీ కమిటీ బాగున్నాపీసీసీ అధ్యక్షుడి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీరు బాగోలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. లేదంటే ఆ ఓటమికి బాధ్యతగా పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసేవాడినని కోమటిరెడ్డి తెలిపారు. మంత్రి సవాల్‌ చేస్తే తప్పించుకుని తిరిగేవాడు పీసీసీ చీఫ్‌గా ఉండటం మా దౌర్భాగ్యమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇక పార్టీ మార్పు ఊహాగానాలకు తెరదించుతూ, భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హరీశ్ తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.

 కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రిని కలిసినట్టుగా వెల్లడించారు. నల్గొండ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి హరీశ్ రావు సానుకూల స్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక పార్టీ మార్పు గురించి మీడియా ప్రతినిథులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రశ్నించగా.. బదులుగా మీడియా ప్రతినిథులకే ప్రశ్న వేశారు. 'టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా నేనెప్పుడైనా చెప్పానా..?' అంటూ ఎదురు ప్రశ్నించారాయన. 


మరింత సమాచారం తెలుసుకోండి: