ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమవుతోంది. రాజధాని నిర్మాణం అనేది రోజుల్లోపని కాకపోయినా.. అనుకున్నంత వేగంగా.. చంద్రబాబు సర్కారు చెప్పినంత వేగంగా మాత్రం రాజధాని నిర్మాణం పూర్తి కావడం లేదు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయినా రాజధాని విషయంలో చెప్పుకోదగిన పురోగతని కనిపించడం లేదు. దీనికితోడు డిజైన్ల మీద డిజైన్లు మారుస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని అపవాదు వస్తోంది. 

ఇదే అంశంపై వైసీపీ అధినేత జగన్ కు చెందిన సాక్షి పత్రిక బ్యానర్ వార్త ప్రచురించింది. అమరావతిని నూతన రాజధానిగా ప్రకటించి ఏడాదిన్నర అవుతున్నా.. నిర్మాణం మాత్రం ఒక్క అడుగైనా ముందుకు కదలడం లేదని విమర్శస్తోంది. మాస్టర్‌ప్లాన్లు, డిజైన్లు అంటూ అప్పుడప్పుడూ ప్రజలకు రంగురంగుల బొమ్మల కొలువులను చూపించడం మినహా ఇప్పటిదాకా ఒక్క నిర్మాణాన్ని కూడా ప్రారంభించిన దాఖలు లేవని కడిగిపారేసింది. 

బొమ్మలు చూసుకుంటూ బతకాల్సిందేనా..!?




రాజధాని విషయంలో ఏపీ సర్కారు ప్రచారానికే ఎక్కువ ప్రధాన్యమిస్తోందంటోంది సాక్షి. సింగపూర్ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లోని ఆకాశహార్మ్యాలు, ఫ్లైఓవర్లు, ఐకానిక్ టవర్ల బొమ్మలతో ఘనంగా ప్రచారం చేసుకుంటోందని... అదిగో రాజధాని.. ఇదిగో రాజధాని అంటూ ప్రజానీకాన్ని ఏమారుస్తోందని అంటోంది. నెలకోసారి బొమ్మల డిజైన్లను ప్రణాళికల పేరుతో విడుదల చేసి హంగామా చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పనులు మొదలే కావడం లేది రాసింది.

రాజధాని పేరుతో సేకరించిన వేలాది ఎకరాలను ఎవరికి కట్టబెట్టాలనే అంశంలో ప్రభుత్వ పెద్దలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవడం వల్లే నిర్మాణంలో జాప్యం జరుగుతోందని సాక్షి విశ్లేషించింది. ఎవరికి కట్టబెడితే తమకు ఎక్కువ లబ్ధి కలుగుతుందనే విషయంలో వారు లోపాయికారీగా తర్జనభర్జన పడుతున్నారట. రాజధాని నిర్మాణం ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు, తమకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదని సర్కారు పెద్దలు కృతనిశ్చయంతో ఉన్నట్లు సాక్షి అభిప్రాయపడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: