మంద కృష్ణ మాదిగ.. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు.. మాదిగ అని చెప్పుకునేందుకు వెనుకడుగు వేసే స్థాయి నుంచి తన పేరులోనే కులాన్ని గర్వకారణంగా పెట్టుకుని ఆ సామాజిక వర్గంలో చైతన్యం తెచ్చిన నాయకుడు. దశాబ్దాలుగా దళితుల్లో ఓ సామాజిక వర్గమే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తోందని.. అందుకే దళితుల్లోనూ ఏబీసీడీ వర్గీకరణ ఉండాలని పోరాడిన నాయకుడు. 


కేవలం పోరాటమే కాదు.. ఓ దశలో ఆ లక్ష్యం అందుకున్నారు కూడా. కానీ కోర్టులు దాన్ని అంగీకరించకపోవడం వల్ల పరిస్థితి మొదటికివచ్చింది. అలా వర్గీకరణ అంశాన్ని భుజానికెత్తుకుని పెద్ద నాయకుడిగా ఎదిగాడు మంద కృష్ణ మాదిగ. అంతే కాదు.. పసిపిల్లల్లోని గుండె జబ్బుల అంశాన్ని కూడా హైలెట్ చేసి ఒక రకంగా ఆరోగ్య శ్రీ వంటి పథకానికి బీజం పడేలా చేసింది కూడా మంద కృష్ణే. 


ఆ తరువాత మంద కృష్ణ చంద్రబాబు తొత్తుగా మారారని.. క్రమంగా పార్టీలకు అనుగుణంగా పని చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఏదేమైనా మాదిగ సామాజిక వర్గంలో గుర్తింపున్న నేత మంద కృష్ణ మాదిగ. ఆయన కుమార్తె వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో రావడం విశేషం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొదలుకుని పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి విచ్చేశారు. 


కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రతిపక్షనేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, గద్దర్ తో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.




వివాహానికి విచ్చేసిన వెంకయ్య నాయుడు వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు వివాహ వేడుక అని కూడా చూడకుండా వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటానని ప్రసంగించడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: