కర్ణాటక రాష్ట్రంలోని జయనగర్‌ అసెంబ్లి స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 10 రౌండ్లు పూర్తికాగా... కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కడపటి సమాచారం అందేసరికి బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై సౌమ్యారెడ్డి 10,256 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆమెకు మొత్తం 31,642 ఓట్లు లభించాయి.

బీఎన్ ప్రహ్లాద్ 21,437 ఓట్లతో వెనుకబడ్డారు. గత నెలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి బిఎన్‌ విజయ్‌ కుమార్‌ హఠాన్మరణం చెందడంతో, ఈ నియోజకవర్గానికి ఎన్నిక వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అధికార కూటమిలోని జేడీఎస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలో నుంచి తప్పించి కాంగ్రెస్ మద్దతు పలికింది.

సౌమ్యారెడ్డి కర్ణాటక మాజీ మంత్రి ఆర్. రామలింగారెడ్డి కుమార్తె కావడం గమనార్హం. బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ ను బీజేపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దింపగా, కాంగ్రెస్‌ అభ్యర్థిని సౌమ్యారెడ్డిని బలపరుస్తూ తమ అభ్యర్థిని జేడీఎస్‌ ఉపసంహరించుకుంది. ఈ నియోజకవర్గంలో ప్రహ్లాద్ వైపు ఓటర్ల సింపతీ పవనాలు వీస్తాయని బీజేపీ భావించగా, తొలి ట్రెండ్స్ అందుకు విరుద్ధంగా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: