అయోధ్య రామమందిరంబాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదలాయించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. అక్టోబరు 29న అయోధ్య కేసును విచారిస్తామని సీజేఐ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయోధ్య లో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలంటూ 2010లో అలహాబాద్‌ కోర్టు వెల్లడించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును సీజేఐ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ విచారిస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబరు 2న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ దీపక్ మిశ్రాకు ఇదే చివరి తీర్పు కానుంది.


సుప్రీంకోర్టులో మరో ఐదు పని దినాలే ఆయనకు మిగిలి ఉన్నాయి.  కాగా, అయోధ్య కేసు భూవివాదంగానే చూస్తామని..భూ యాజమాన్య హక్కులపై అక్టోబరు 29 నుంచి విచారిస్తామని స్పష్టంచేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనమే వాదనలు వింటుందని తెలిపింది.  అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే తుది నిర్ణయంపై 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం తెల్చిచెప్పింది. ఈ సందర్భంగా మెజారిటీ అభిప్రాయంతో జస్టిస్ నజీర్ విభేదించారు.    ఐతే చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ వాదనతో జస్టిస్ నజీర్ ఏకీభవించలేదు. 1994 నాటి తీర్పును పున:సమీక్షించాలని..కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.  


కాగా, అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిలకు సమాన ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలంటూ 2010లో అలహాబాద్‌ కోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు సుప్రీం తాజా తీర్పుతో అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మరో అడుగు దగ్గర పడిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. త్వరలోనే ఆయోధ్యలో రామమందిరం నిర్మాణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: