ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన డోలా శ్రీబాల వీరాంజ‌నేయ‌స్వామి ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న త‌న‌ను గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించిన వారిని త‌క్కువ చేసి చూడ‌డం, వారి మాట‌ల‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డం, తానే అన్నీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం స్థానికంగా టీడీపీని తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వైద్య వృత్తి నుంచి వ‌చ్చిన డోలాకు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఎంతో విలువ ఇచ్చారు. అడిగిన వెంట‌నే ఆయ‌న‌కు టికెట్ ఇచ్చి ప్రోత్స‌హించారు. అయితే, దీనికి స్థానికంగా ఉన్న టీడీపీ సీనియ‌ర్లు ఎంతో కృషి చేశారు. 


2009 ఎన్నిక‌ల్లో స్వామి ఓడినా 2014 ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో చంద్ర‌బాబు సీటు ఇచ్చారు. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను ఓర్చుకున్న నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కేడ‌ర్ ఆయ‌న్ను గెలిపించింది. ఎమ్మెల్యే అయ్యాక కూడా చంద్ర‌బాబు స్వామిని టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గాను, శాస‌న‌స‌భ ప్రివిలైజ్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇచ్చి గౌర‌వించారు. అయితే ఇప్పుడు స్వామి నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌డైతే నాకేంటి అన్న‌ట్టుగా విర్ర‌వీగుతున్నాడ‌ని టీడీపీ నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత డోలా వ్య‌వ‌హార శైలిపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఎవ‌రినీ లెక్క‌చేయ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


దీనికితోడు పార్టీలోనే వ‌ర్గాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని, త‌న‌కు ఎవ‌రూ టికెట్ ఇప్పించ లేద‌ని, తాను ఎవ‌రి మాట‌నూ వినాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే చెప్పుకొస్తున్నారు. అదేస‌మ‌యంలో జిల్లా పార్టీ ఇంచార్జ్ కి చెప్ప‌కుండానే ఆయ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం.. క‌నీస ప్రొటోకాల్‌కు కూడా గౌర‌వం ఇవ్వ‌క‌పోవ డంతో వివాదం మ‌రింతగా ముదురుతోంది. ఇక‌, స్థానికంగా అభివృద్ది విష‌యంలోనూ డోలా తీవ్రంగా వెనుక‌బ‌డ్డారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇచ్చిన హామీలు ఒక్క‌టి కూడా అమలు కాలేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న చేస్తున్నారు. 


వృత్తి రీత్యా వైద్యుడు కావ‌డంతో ప్ర‌భుత్వం ఆస్ప‌త్రిలో కొన్ని వ‌స‌తులు క‌ల్పించినా.. మౌలిక స‌దుపాయాలైన తాగునీరు, ర‌హ‌దారుల అభివృద్ది, ఉపాది క‌ల్ప‌న వంటి విష‌యాల‌ను ఆయ‌న‌లైట్‌గా తీసుకున్నారు. దీంతో ఇక్క‌డ పార్టీ కి ఓట్లు వేస్తామ‌నే టీడీపీ అభిమానుల సంఖ్య‌ త‌గ్గుముఖం ప‌ట్టింది. దీనిని గ‌మ‌నించిన‌స్థానిక టీడీపీ నాయ‌క‌త్వం ఆయ‌న‌ను హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఆయ‌న మాత్రం త‌న‌కు అన్నీ తెలుసు.. ఎవ‌రు ఏమీ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రైనా స‌మ‌స్య‌ల‌పై త‌న వ‌ద్ద‌కు వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. మొత్తానికి ఈ విష‌యం.. స్థానిక టీడీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. 


ఇక తాజాగా స్వామిని వ్య‌తిరేకిస్తోన్న వారు కొండ‌పి టీడీపీ ప‌రిరక్ష‌ణ స‌మితి పేరుతో పెద్ద సభ కూడా ఏర్పాటు చేసి స‌త్తా చాటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వామికి సీటు ఇస్తే ఆయ‌న‌కు ప‌నిచేసేది లేద‌ని వీరంతా శ‌ప‌థాలు చేస్తున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో మెజార్టీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు సైతం స్వామిని వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇప్పించినా ఆయ‌న‌కు స‌హ‌క‌రించే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదు. ఏదేమైనా స్వామి తీరుతో కొండ‌పి టీడీపీ స‌ర్వ‌నాశ‌నం అయిపోయింది. ఈ ప‌రిణామాలు విప‌క్ష వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: