ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే 40 రోజులకు పైగా సుదీర్ఘంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన నాయకుల ఎదురు చూపులకు మరో 72 గంటలలో ఫలితం వచ్చేయ‌నుంది. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులు అందరూ తమ గెలుపు ఓటముల పై సహజంగానే టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. వీరందరి టెన్షన్ ఒక ఎత్తు అయితే సినీ నటుడు, హిందూపురం టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ టెన్ష‌న్ మ‌రో ఎత్తు. బాలయ్య‌కు ఏకంగా 3 టెన్ష‌న్‌లు నెలకొన్నాయి. ఈసారి బాలయ్య గెలుపు హిందూపురంలో అంత సులువు కాదు. హిందూపురం ప్రజలు గత ఎన్నికల్లో బాలయ్యను ఎన్నో అంచనాలతో గెలిపిస్తే ఆయన ఆ అంచనాలు ఏ మాత్రం అందుకోలేక పోయారు. 


బాలయ్య సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ హిందూపురంలో పీఏల పాలన కొనసాగిస్తూ వ్యవహరించిన తీరుతో హిందూపురం ప్రజలు బాలయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఇదే రేపు ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిభింభించ‌నుంది. చివరకు బాలయ్య సతీమణి వసుంధర సైతం హిందూపురంలో మకాం వేసి ప్రచారం చేశారు. బాలయ్యకు తన గెలుపు ఒక టెన్షన్ అయితే... తన ఇద్దరు అల్లుళ్ల‌ గెలుపు అంతకుమించిన టెన్షన్ గా ఉంది. వాళ్ళ ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా బాలయ్యకు పెద్ద అవమానమే. గతేడాది తెలంగాణ ఎన్నికల్లో నందమూరి ఆడబిడ్డ సుహాసిని ఓటమి ఆ పార్టీ క్యాడర్‌తో పాటు నందమూరి కుటుంబానికి ఎంత అవమానంగా మిగిలిందో ఇప్పుడు బాలయ్య ఇద్దరు అల్లుళ్ల‌లో ఎవరు ఓడిపోయినా అది బాల‌య్య‌కే మాయ‌ని మ‌చ్చ‌గా మిగులుతుంది. 


బాలయ్య కు ఎంత కష్టతరమైన వార్త అంటే హిందూపురంతో పాటు ఇద్దరూ అల్లుళ్లు పోటీ చేసిన మంగళగిరి, విశాఖ లోక్‌స‌భ సీట్లను సైతం టీడీపీకి ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది.  పెద్దల్లుడు లోకేష్ మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆర్‌కే నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అక్కడ లోకేష్ ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ఎదురుదెబ్బగా నిలుస్తుంది. మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత సులువు కాదు. ఇద్దరు అల్లుళ్ళ తో పోలిస్తే కొంతలో కొంత లోకేష్ సేఫ్ జోన్‌లో ఉన్నాడ‌ని అనుకోవాలి. లోకేష్ మంగళగిరి కన్నా టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ఎంత టెన్షన్ ఉండేది కాదేమో. హిందూపురం, పెనమలూరు, పెదకూరపాడు లాంటి బలమైన సీట్లు వదులుకొని మంగళగిరిలో పోటీచేసి  లోకేష్ తాను టెన్ష‌న్‌ పడటంతో పాటు అందరినీ టెన్షన్ పెట్టేస్తున్నాడు. 


ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ గెలుపుపై టీడీపీలోనే అనేక సందేహాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది టీడీపీ వాళ్లు సైతం అసెంబ్లీకి టిడిపికి ఓటు వేసి ఎంపీకి మాత్రం జనసేన అభ్యర్థి జేడికి సహకరించారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. లోకేష్ ఎంతోకొంత మెజార్టీతో బయటపడతాడు అన్న ధీమా టిడిపి అధిష్టానానికి ఉన్నా... భర‌త్ విషయంలో మాత్రం పెద్ద సందేహమే ఉంది. ఏదేమైనా  బాలయ్యకు ఇప్పుడు హిందూపురంలో త‌న గెలుపుతో పాటు త‌న ఇద్ద‌రు అల్లుళ్ల గెలుపుపై పెద్ద టెన్ష‌నే ప‌ట్టుకుంది. ఈ టెన్ష‌న్ 23 తుది ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: