ఏపీ సీఎంగా జ‌గ‌న్ ఈ నెల 30న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో ప్ర‌మాణ‌స్వీకారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముందుగా తాను మాత్ర‌మే ప్ర‌మాణస్వీకారం చేసి ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా కేబినెట్‌ను విస్త‌రించుకుంటూ రావాల‌న్న‌దే జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించ‌డంతో మంత్రి ప‌ద‌వి కోసం చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్‌ల ఎంపిక‌లో ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. సీనియ‌ర్లుగా ఉన్నా గ‌తం అవినీతి, ఆరోప‌ణ‌లు ఉన్న వారికి దూరం పెడ‌తార‌ని కూడా అంటున్నారు.


ఇక రాష్ట్రంలో అవినీతి ర‌హిత పాల‌న అందిస్తాన‌ని చెపుతోన్న జ‌గ‌న్ క్లీన్ ఇమేజ్ ఉన్న కొంత‌మందికి చోటు ఇస్తార‌ని అంటున్నారు. ఇక తొలిసారి ఎన్నికైన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు త‌న‌కు అత్యంత స‌న్నిహితులు కావ‌డంతో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల కోణంలో కూడా వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ఛాన్సులు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి టీడీపీలో వివాదాల‌కు పెట్టింది పేరు అయిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచిన కొఠారు అబ్బ‌య్య చౌద‌రి పేరు వినిపిస్తోంది.


అబ్బ‌య్య చౌద‌రి ప్ర‌భాక‌ర్‌పై ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో సాధించి రికార్డుల‌కు ఎక్కారు. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేకుండా (చింత‌మ‌నేని అబ్బ‌య్య తండ్రి రామచంద్ర‌రావు ద‌గ్గ‌రే రాజ‌కీయ ఓన‌మాలు దిద్దారు) లండ‌న్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఆయ‌న వైసీపీని యూర‌ప్‌, యూకే ప్రాంతాల్లో బ‌లోపేతం చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా కూడా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే చింత‌మ‌నేని అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అబ్బ‌య్య‌కు సీటు ఇవ్వ‌గా ఆయ‌న గ‌తంలో చింత‌మ‌నేనికి వ‌చ్చిన మెజార్టీల‌ను క్రాస్ చేసి మ‌రీ విజ‌యం సాధించారు.


ఇక చింత‌మ‌నేనిని ఓడించ‌డంతో పాటు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డం, క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఈక్వేష‌న్‌, క్లీన్ ఇమేజ్ నేప‌థ్యంలో అబ్బ‌య్య చౌద‌రికి ఈ సారి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే అబ్బ‌య్య చౌద‌రి వ్యక్తిత్వం జ‌గ‌న్‌కు పూర్తిగా తెలుసు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఐటీ శాఖా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఐటీ రంగంలో సుదీర్ఘ‌మైన అనుభ‌వం అబ్బ‌య్య సొంతం. అలాగే ఆయ‌న‌కు యూర‌ప్‌లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల్లో కొన్నింటి శాఖ‌లు అయినా ఇక్క‌డ‌కు తీసుకువ‌స్తే ఏపీలో కొంత‌మంది యువ‌త‌కు అయినా ఉపాధి దొరుకుతుంది.


యూర‌ప్‌, యూకేలో ఉన్న వివిధ సాఫ్ట్‌వేర్‌, ఇత‌ర‌త్రా ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌న అనుభ‌వంతో ఇక్క‌డ‌కు తీసుకు వ‌స్తే అంత‌కు మించిన స‌క్సెస్ మ‌రొక‌టి ఉండ‌దు. టీడీపీ పాల‌న‌లో ఈ శాఖ‌ను నారా లోకేష్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ చివ‌రి రెండు సంవ‌త్స‌రాలు మంత్రిగా ప‌నిచేసినా ఆయ‌న వ‌ల్ల ఏపీకి కొత్త‌గా వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు లేవు. మ‌రి ఇప్పుడు అబ్బ‌య్య‌కు జ‌గ‌న్ మంత్రి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: