ఎప్పుడైతే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారో..అప్ప‌టినుంచే ఏపీలో ప్ర‌క్షాళ‌న మొద‌లైంది. కిందిస్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు అంతా త‌న టీంను ఏర్పాటు చేసుకునేందుకు జ‌గ‌న్ కార్య‌చ‌ర‌ణ ప్రారంభించారు.ఇందులో భాగంగానే ఏపీ డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్ ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటు అధికారుల‌నే కాదు, అటు వివిధ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను అనుభ‌విస్తున్న టీడీపీ నేత‌ల‌ను కూడా జ‌గ‌న్ మార్చ‌బోతున్నారు.

మార్చడం కాదు,ఇప్ప‌టికే ప‌లు కార్పోరేష‌న్ల చైర్మ‌న్లు రాజీనామాలు చేశారు.మ‌రికొంత మంది రాజీనామా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విలో కొన‌సాగుతున్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వంటి వారు రాజీనామా చేసేందుకు మొండికేస్తున్నా..ఆఖరి నిమిషంలో వారి ప‌ద‌వి ర‌ద్దు కాక‌త‌ప్ప‌ద‌న్న సంగ‌తి తెలియ‌నిది కాదు.

మొత్తానికి ఖాళీ అవుతున్న స్థానాల్లో భ‌ర్తీ చేసే బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 8న మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం ముగిసిన అనంత‌రం నామినేటెడ్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్ట‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే, ఏపీలో ఎన్ని ప‌ద‌వులు ఖాళీ అవుతున్నా, అంద‌రిచూపు మాత్రం టీటీడీ చైర్మ‌న్ పీఠంపైనే ఉంది.


టీటీడీ చైర్మన్ ప‌ద‌విని ఆశిస్తున్న వారు అర‌డ‌జ‌నుకు పైగానే ఉన్నారు.భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మోహ‌న్ బాబు,మ‌ల్లాది విష్ణు,కోన ర‌ఘుప‌తి ఇలా చాలామంది పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో భూమ‌న‌కు పీఠం ఖాయ‌మ‌నుకున్నారు,కానీ, ఆయ‌న మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో,మోహ‌న్ బాబుకు కానీ, వైవీ సుబ్బారెడ్డికి కానీ ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కాదు కూడ‌దనుకుంటే బ్రాహ్మ‌ణ ఎమ్మెల్యేలైన మ‌ల్లాది విష్ణు,కోన ర‌ఘుప‌తిల‌లో ఒకరికి ద‌క్క‌వ‌చ్చ‌నే ప్రచారం కూడా జోరందుకుంది.


ఇక‌పోతే.. టీటీడీ పాల‌క‌మండలిలో ఆన‌వాయితీ ప్ర‌కారం గ‌త కొన్నేండ్లుగా ఏపీతో పాటు ఇత‌ర రాష్ట్రాల వారికి కూడా స‌భ్యులుగా అవ‌కాశం ల‌భిస్తున్న సంగ‌తి తెలిసిందే.కాక‌పోతే ఏపీలో పాలిస్తున్న ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచే ఇత‌ర రాష్ట్రాల పార్టీల‌కు ఆ అవ‌కాశం ల‌భిస్తూ వ‌స్తోంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో తెలంగాణ‌లో బీజేపీకి చెందిన చింత‌ల రామ‌చంద్రారెడ్డికి టీటీడీ స‌భ్యుడిగా అవ‌కాశం ల‌భించిన సంగ‌తి తెలిసిందే.


తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఆ ప‌ద‌వి టీఆర్ఎస్ నేత‌కు ల‌భించ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.ఆయ‌న మ‌రోవ‌రో కాదు..మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇత‌ను 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీచేసి గెలిచాడు.అనంత‌రం అధికార టీఆర్ఎస్ లో చేర‌డం జ‌రిగింది.అయితే,పార్టీ మారిన సంద‌ర్భంలోనూ అధినేత జ‌గ‌న్ తో చ‌ర్చించాకే పార్టీ మారిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఎలాగు తెలంగాణ‌లో వైసీపీకి పెద్ద‌గా ప‌ట్టు లేనందున పొంగులేటితో పాటు మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.


 అయితే, గ‌తంలో వైసీపీ నేతగా ఉన్న‌ప్పుడు ఉన్న ప‌రిచ‌యాల‌తో పాటు తాజాగా సీఎం కేసీఆర్ కూడా పొంగులేటికి అవ‌కాశం ఇవ్వాల‌ని రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కాకుండా, టీడీపీ నుంచి వ‌చ్చిన నామా నాగేశ్వ‌ర‌రావుకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందున‌, పొంగులేటికి ఏదోఒక ర‌కంగా ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ యోచిస్తున్నారు.


ఇదే అదునుగా ఏపీలో మంచి సత్సంబంధాలు క‌లిగి ఉన్న జ‌గన్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినందున తెలంగాణ కోటాలో ఒకవేళ ఎవ‌రికైనా టీటీడీ స‌భ్యుడి ప‌ద‌వి ఇవ్వ‌ద‌లుచుకుంటే అది పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి ఇవ్వాల‌ని కేసీఆర్ సూచించార‌ట‌.ఇందుకు జ‌గ‌న్ కూడా అంగీక‌రించార‌ని ప్ర‌చారం.






మరింత సమాచారం తెలుసుకోండి: