అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ఈ వలసలు ఎక్కువగా బీజేపీలోకి ఉన్నాయి. కానీ ఒకరిద్దరు మాత్రం వైసీపీలోనూ చేరిపోతున్నారు. బీజేపీకి వెళ్లినా.. వైసీపీకి వెళ్లినా.. టీడీపీలో ఉండటం మాత్రం చాలా మంది నేతలు భారంగా ఫీలవుతున్నారు. పార్టీ ఇప్పట్లో కోలుకునే ఆశలు కనిపించకపోవడం అందుకు ఓ కారణం కావచ్చు.


తాజాగా.. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి చేరవచ్చని మీడియాలో ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం అనుకూల మీడియాగా పేరున్న పత్రికలోనే ఈ వార్త రావడం విశేషం. ‘విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మల్లాది విష్ణు ఉన్నారు. అందువల్ల బోండా ఉమ వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి ఈ మేరకు ఆఫర్ ఉందట. కానీ.. బోండా ఉమ మాత్రం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆ విషయం వద్దే కాస్త ప్రతిష్టంభన ఉందట.


బోండా ఉమ వైసీపీలో చేరడం మాత్రం పక్కా.. కాకపోతే సీటు విషయంలోనే కాస్త అటూ ఇటూ అవుతోందని ఆ కథనం చెబుతోంది. బోండా ఉమ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన ఆగస్ట్ 4, 5 తేదీల్లో విజయవాడ వస్తారు. ఆ తర్వాత ఈ చేరిక విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోండా ఉమ కు బెజవాడలోని కాపు సామాజిక వర్గంపై పట్టుంది.


అయితే బోండా ఉమ.. గతంలో వైసీపీ నేతలపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. అసెంబ్లీలో ఏకంగా రౌడీ భాష ఉపయోగించారు. అలాంటి ఉమను పార్టీలో చేర్చుకుంటారా అన్న విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. రాజకీయాల్లో వాటిని అంతగా పట్టించుకునే ఛాన్స్ లేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాదు కనుక వైసీపీలో చేర్చుకోవడం అంత కష్టం కూడా కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: