దశాబ్దాల పాటుగా  కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఆ  పార్టీకి గుడ్ బై  చెప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  రాజీవ్ గాంధీ జయంతి తర్వాత పార్టీ మారే విషయమై అభిమానులు,  కార్యకర్తలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని వీహెచ్  పేర్కొన్నారు . దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న హన్మంత రావు కాంగ్రెస్ పార్టీని వీడుతారని కార్యకర్తలు ఎవరూ కూడా ఊహించి ఉండరు .


 కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన లక్ష్యమని , రాహుల్ ను ప్రధానిగా చూడాలన్నదే తన చిరకాల వాంఛ అంటూ చెప్పుకొచ్చే  హనుమంతరావు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీ లో చేరాలని నిర్ణయించుకోవడం తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా విస్మయానికి గురి అవుతున్నారు. గాంధీ  ఫ్యామిలీతో  హనుమంతరావుకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనకు రెండు  పర్యాయాలు  పార్టీ నాయకత్వం,  రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టింది. అయినా కూడా హన్మంతరావు తనకు పార్టీలో అన్యాయం జరిగిందని పక్క పార్టీల వైపు చూడడం పట్ల  సాధారణ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది .


 ఇటీవల జరిగిన లోక్ సభ  ఎన్నికల్లో తాను ఖమ్మం టికెట్ అడిగితే తన పేరు లేకుండానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం   అధిష్టానానికి జాబితాను పంపిందని  హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక తాను కాంగ్రెస్ లో  కొనసాగి లాభం లేదని భావిస్తోన్న ఆయన ...  బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ లో బీజేపీ క్రమేపీ బలపడుతున్న సూచనలు కన్పిస్తుండడం తో  కాంగ్రెస్ పార్టీ లోని సీనియర్లు , కమలం గూటికి చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: