వైజాగ్-విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య కొన్ని ప్యాసింజ‌ర్ రైళ్ల‌తో పాటు మ‌రికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కొన్ని సూప‌ర్ ఫాస్ట్ రైళ్లు న‌డుస్తున్నాయి. అయితే ఇప్పుడు మ‌రో స‌రికొత్త రైలును రైల్వే అధికారులు ప్ర‌వేశ‌పెట్టారు. ప్రయాణీకుల సౌకర్యార్థం వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెల 26న వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. 


రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. వైజాగ్ నుంచి ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. ఉ.11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి.. రాత్రి 11 గంటలకు వైజాగ్ కు ఈ రైలు చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ప్రారంభ‌మైతే స‌రికొత్త జ‌ర్నీని ప్ర‌యాణికులు ఆస్వాదిస్తారు.


ఈ రైలు ప్రారంభంపై రైల్వేశాఖ మంత్రి పీయూ్‌షగోయెల్‌ తనకు లిఖితపూర్వకంగా తెలియజేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కొద్ది రోజుల క్రిత‌మే వెల్లడించారు. వారానికి ఐదు రోజులపాటు ఈ సర్వీసు నడుపుతామని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ రైలు వల్ల విశాఖ-విజయవాడ మధ్య ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక ఈ రైలు ప్ర‌త్యేక‌త‌ల విష‌యానికి వ‌స్తే ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీంతో ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణించే ప్ర‌యాణికులు ట్రైన్ ఎప్పుడు ప‌ట్టాలు ఎక్కుతుందా ? అని ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.


ఒక కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీతో ఉండే ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకతలు ఎన్నో. విశాఖపట్నం, విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701) దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి రైల్వేస్టేషన్లల్లో ఆగుతుంది. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: