ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు, ధ‌ర్నాలు.. ఈ మాట‌లు వింటే చాలు.. అధికారంలో ఉన్న వారికి కంప‌రం వ‌చ్చేస్తుంది. ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. ధిక్కార‌మున్ సైతువా!! అంటూ.. ఆందోళ‌న‌కారుల‌పై, ఆందోళ‌న‌లకు పిలుపునిచ్చిన వారిపై ఉక్కుపాదం మోప‌డం, గృహ‌నిర్బంధాల‌కు పాల్ప‌డ‌డం వంటివి కామ‌న్‌గా మారిపోయారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆందోళ‌న‌ల‌పై, ఆందోళ‌న‌కారుల‌పై ఈ నిర్బంధాలు, ఖండితాలు కామ‌న్‌. నిజానికి ఉద్య‌మాల నుంచి పురుడు పోసుకున్న తెలంగాణ‌లోని అధికార పార్టీ టీఆర్ ఎస్ కూడా అధికారంలోకి రాగానే ఉద్య‌మాల‌కు చెల్లుచీటీ చెప్పింది. 


త‌మ ప్ర‌భుత్వంపై నిర‌స‌న తెలిపే హ‌క్కు ఎవ‌రికీ లేద‌నే రీతిలో ఆర్టీస్ క్రాస్ రోడ్ స‌మీపంలోని ఇందిరా చౌక్ ఉర‌ఫ్ ధ‌ర్నా చౌక్‌ను అక్క‌డి నుంచి తొల‌గించింది. నిజానికి తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ చేయ‌ని ఉద్య‌మం, తెల‌ప‌ని నిర‌స‌న లేదు. అయినా కూడా ఆయ‌న అధికారంలోకి రాగానే మాత్రం ఉద్య‌మాలు చేయ‌డానికి, ప్ర‌జా గ‌ళం వినిపించేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు ఆస్కారం లేకుండా చేశారు. అయితే, దీనిపై విప‌క్షాలు హైకోర్టుకు ఎక్క‌డం, అక్క‌డ వారికి ఉప‌శ‌మ‌నం పొంద‌డం తెలిసిందే. 


ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే..గ‌డిచిన ఐదేళ్లు ఇక్క‌డ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు.. ఇదే నిర‌స‌న‌ల‌పై ఎలా వ్య‌వ‌హ‌రించారో ఎంత ఎక్కువ చెప్పుకున్నా.. త‌క్కువే అవుతుంది. కాపు ఉద్య‌మం నుంచి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం వ‌ర‌కు, విద్యార్థి ఉద్య‌మాల నుంచి కార్మికుల ధ‌ర్నాల వ‌ర‌కు కూడా ఆయ‌న స‌హించ‌లేక పోయారు. ఉద్య‌మం అన్న‌వారిని ఇంట్లోనే నిర్బంధించి కేసులు న‌మోదు చేసిన ప‌రిస్థితి ఉంది. మ‌రీ ముఖ్యంగా అమ‌రావ‌తి నిర్మాణం విష‌యంలో భూములు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని రైతులు ఉద్య‌మాల‌కు సిద్ధ‌మైతే.. ఏకంగా అక్క‌డ క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం క్రియేట్ చేసి హ‌డ‌లెత్తించారు. 


ఇక‌, ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తిచ్చేందుకు విశాఖ వెళ్లిన అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌ను విశాఖ విమానాశ్ర‌యం నుంచి కాలు కూడా బ‌య‌ట‌కు పెట్టకుండా చేశారు. ఇలా పాల‌కులు ఉద్య‌మాల విష‌యంలోను, ఆందోళ‌న‌ల విష‌యంలో నూ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేందుకు ఈ ఇద్ద‌రు సీఎంలు ప్ర‌త్యక్ష ఉదాహ‌ర‌ణ‌. అయితే, దీనికి భిన్నంగా వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉద్య‌మాలు అనేవి ప్ర‌జాస్వామ్యంలో భాగ‌మ‌ని, ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాల‌ను స‌రిచేసుకునేందుకు ప్ర‌జ‌లు ఇచ్చే అవ‌కాశమ‌ని భావిస్తున్న ఆయ‌న ఉద్య‌మాల‌పై ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. 


అంతేకాదు, తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి నుంచి వ‌స్తుండ‌గా.. అక్క‌డి రైతులు ఆయ‌న కాన్వాయ్‌కు అడ్డుప‌డి `అమ‌రావ‌తికి జై` అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వారికి అభివాదం చేసి వెళ్లిపోయారే త‌ప్ప‌.. ఇప్పుడు కొంప‌లు ఏం మునిగాయ‌ని మీరు ఇలా చేస్తున్నారంటూ.. ఒక్క వ్యాఖ్య కూడా చేయ‌లేదు. ఇదీ జ‌గ‌న్ పాల‌నా ప‌టిమ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: