పిల్లి ఎదురొస్తే అపశకునం అని భావిస్తాం..!! రెండు మాటలు మాట్లాడేవాళ్ళను గోడమీద పిల్లి అని సంభోదిస్తాం...!! కానీ కేవలం పిల్లులను వేటాడి....మాంసం సేకరించే ముఠాలు వున్నాయంటే నమ్మగలమా...!! విశాఖ నగరంలో హల్ చల్ చేస్తున్న ఇలాంటి ఓ గ్యాంగ్ అనూహ్యంగా విశాఖ పోలీసులకు చిక్కింది. 


విశాఖ నగరంలో పిల్లులను వేటాడే ముఠా ఒకటి హల్ చల్  చేస్తోంది. టాటా ఏస్ వాహన౦ చుట్టూ దేవుడి ఫోటోలు అలకరించి వుంటాయి. భక్తిగీతాలు వినిపిస్తుంటాయి. ఈ వాహనంతో  నగర వీధులలో సంచరిస్తూ....వీధి పిల్లులపై రెక్కీ నిర్వహించటం ఆ తర్వాత వాటిని వేటాడటం .. వాహనం లోపల కర్రలతో కొట్టి హతమార్చి గోనెసంచుల్లో కుక్కేయట౦ వీరి పని. గత కొద్ది రోజులుగా నగరంలో ఈ ముఠా కదలికలపై విశాఖ సిటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్ అనే ఎన్జీవో ప్రతినిధులు కన్నేశారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జోడు గుండ్లపాలెం దగ్గర వీధులలో సంచరిస్తూ పిల్లులను వేటాడుతు౦డగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఇద్దరు పురుషులతో పాటు వాహనంలో ఉన్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఓ బతికున్న పిల్లితో పాటు మరో చనిపోయిన పిల్లిని..  పిల్లులను వెంటాడే ప్రత్యేక కర్రలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా సంచార జాతికి చెందిన వారని... గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం బెల్లంకొండ గ్రామస్ధులని పోలీసులు గుర్తించారు. 


ఆధ్యాత్మిక ముసుగులో.... వీధి పిల్లులను వేటాడటం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదు. ఈ ముఠా వైఖరి చూస్తే ఎలాంటి అనుమానం రాదు. కానీ ఆధ్యాత్మిక ముసుగులో...జీవహింస... భక్తిపాటలు... వెనుక  పిల్లుల చావు కేకలు వుంటాయి. అసలు ఈ ముఠా సభ్యులు పిల్లులను ఎందుకు వేటాడుతున్నారు?  పిల్లుల మాంసాన్ని ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? ఇదే అనేక అనుమానాలకు దారి తీస్తోంది. విశాఖ సొసైటీ ఫర్ ప్రొటక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్  స్వచ్చంద స౦స్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాలికి కట్టిన కట్లు విప్పుతుండగా ఓ పిల్లి పరారవ్వగా.... చనిపోయిన పిల్లిని పోస్టుమార్టం నిమిత్తం ఆరిలోవలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. పిల్లులను చంపి వాటి మాంసాన్ని ఏం చేస్తున్నారన్న దానిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు మాత్రం తామంతా ఒకే కుటుంబానికి చెందిన సంచార జీవులుమని చెబుతున్నారు. టాటా ఏసీ వాహనంలో తిరుగుతూ ప్రజల నుంచి చందాలు వసూలు చేసి జీవనం కొనసాగిస్తున్నామని పిల్లులను వేటాడింది తాము వండుకు తినడానికి అని అంటున్నారు. అయితే ఎన్జీవో ప్రతినిధులు మాత్రం పిల్లుల్ని వేటాడి వాటి మాంసాన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. హోటల్ యజమానులు పిల్లి మాంసాన్ని వీరి నుంచి కొనుగోలు చేసి చికెన్, మటన్ స్థానంలో వీటిని కస్టమర్స్ కి అందిస్తున్నారని చెబుతున్నారు. విశాఖ నగరంలో ఇదంతా గత నాలుగేళ్లుగా జరుగుతుంద౦టున్నారు. గతంలోనూ వన్ టౌన్ పోలీస్టేషన్ లో  ఫిర్యాదు చేయగా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారని వీరి దందాపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: