వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు 21 లక్షల 69 వేల ధరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పరీక్ష గురించి అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు చేసారు. 
 
పరీక్ష కేంద్రంలోకి బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్, హాల్ టికెట్, పాన్ లేదా ఆధార్ లేదా ఓటర్ కార్డ్ కచ్చితంగా తెచ్చుకోవాలి. వాచ్, క్యాలిక్యులేటర్, ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఉదయం పరీక్ష రాసే అభ్యర్థులు 9 గంటల సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 9 : 30 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించటంతోపాటు ఓ ఎం ఆర్ షీట్ ఇస్తారు. 10 గంటల సమయానికి నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 
 
పంచాతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పరీక్ష జరిగిన రోజునే కీని వెల్లడిస్తామని తెలిపారు. 1,22,554 మంది సిబ్బందిని పరీక్షలను నిర్వహించటం కోసం నియమించినట్లు తెలిపారు. 5,314 కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించబోతున్నట్లు గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 
 
దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లు, వాలంటీర్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నామని 50 నిమిషాలు అదనంగా పరీక్ష రాయటానికి దివ్యాంగులకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను మారుమూల ప్రాంతాలలోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవటానికి వీలుగా నడపబోతున్నట్లు ద్వివేది తెలిపారు. గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థుల ఎంపిక రాత పరీక్షల ఫలితాల మెరిట్ ఆధారంగా ఉంటుందని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేసారు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: