చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడా..గతమెంతో ఘన కీర్తి కలవాడా అన్న గీతం తెలుగుజాతి చరిత్రను, ఔన్నత్యాన్ని గుర్తు చేస్తుంది. మన తెలుగుకు ఎంతో చరిత్ర ఉంది. వేల ఏళ్లనాటి మనుగడ ఉంది. కానీ దాన్ని పరిశోధన చేసేందుకు తగిన కృషి జరగడం లేదు. ప్రాచీన తెలుగు విశిష్టతను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కూడా 11ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలో కాకుండా మైసూరులో ఏర్పాటైంది.


ఆ కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాలకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎట్టకేలకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం తెలుగు గడ్డపై ఏర్పాటు కాబోతోంది. దాదాపు 11 ఏళ్ల క్రితం మైసూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి చొరవతో ఇది సాధ్యమవుతోంది.


దేశంలోని భాషల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూరులో 1969లో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్ ను ఏర్పాటు చేసింది. 2004లో తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించిన వెంటనే... తమిళనాడు తన భాషా కేంద్రాన్ని సొంత రాష్ట్రానికి తరలించుకుపోయింది. 2008లో తెలుగుకు ప్రాచీన భాష హోదా దక్కినా అధ్యయన కేంద్రం మాత్రం మైసూరులోనే ఉండిపోయింది. అప్పటి నుంచి దీన్ని తెలుగు ప్రాంతానికి తరలించాలని డిమాండ్ ఉన్నా.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో కేంద్రాన్ని ఎక్కడ పెట్టాలన్నదానిపై స్పష్టత లేక ఇన్నాళ్లూ పెండింగ్ లో ఉండిపోయింది.


అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడి చొరవతో నెల్లూరుకు దీనిని తరలించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. గత నెల 29న ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరుకు ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని తరలిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చినా.. నగరంలో దానిని ఎక్కడ ఏర్పాటుచేయాలో ఇంకా ఖరారు కాలేదు. తాత్కాలికంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: