ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లదని కొట్టేయడం కన్నా చెంపదెబ్బ ఏం కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నా, చట్ట ఉల్లంఘనలకు పాల్పడినా న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏం ఉందని నిలదీశారు.  పిపిఏలను క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. వాస్తవానికి అది ఈఆర్ సి పరిధిలోని అంశమని కోర్టు   చెప్పిందన్నారు. ఈ తీర్పుతో ఇన్నాళ్లూ వైసిపి చేసిన ఆరోపణలు అవాస్తవాలు అనేది  స్పష్టమైందన్నారు. మంగళవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబుతో  టిడిపి నేతలు భేటి అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేశారు. రివర్స్ టెండర్ పేరుతో టెండర్ ను రిజర్వ్ చేశారు, డెవలప్ మెంట్ ను రివర్స్ చేశారు. గత 4నెలల్లో వైసిపి ప్రభుత్వం చేతకానితనంతో సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ చేస్తోంది. 
రివర్స్ టెండర్ల వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి..? ప్రజలకు జరిగే నష్టం ఎంత అని ప్రశ్నించారు.  ఈ అంశంలో అధ్యయనం చేయకుండా మూర్ఖంగా వెళ్లి,  ప్రాజెక్టు భద్రతతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. 



పోలవరం ప్రాజెక్ట్ హైడల్ వర్క్స్, పవర్ హౌస్  పనులు రెండింటిని ఎందుకు కలిపారని నిలదీశారు.  సివిసి గైడ్ లైన్స్ ఎందుకు ఉల్లంఘించారన్నారు. టెండర్లు రివర్స్ చేయడం కాదు, మొత్తం  డెవలప్ మెంట్ నే రివర్స్ చేశారని మండిపడ్డారు. ఆ రోజు ఇదే సంస్థ పోలవరం పనుల్లో టెండర్ ఎందుకు ఎక్కువకు వేసింది.,  ఈరోజు తక్కువకు ఎలా వేసిందని సూటిగా ప్రశ్నించారు. అప్పుడు ఇదే సంస్థను చంద్రబాబు బినామీ సంస్థ అన్నారు. పట్టిసీమలో దానికి రూ.350కోట్లు దోచిపెట్టారని ఇదే మేఘను ఆరోజు విమర్శించారని ధ్వజమెత్తారు. ఇప్పుడా సంస్థకే ఎలా టెండర్ రిజర్వ్ చేశారన్నారు. రాష్ట్రానికి 10రెట్లు నష్టం చేసి ఇంకా ఆదా చేశామని డబ్బా కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు.  గతంలో పని చేసిన సంస్థలకు నష్ట పరిహారం కింద ఎన్నివందల కోట్లు చెల్లిస్తారని చంద్రబాబు నిలదీశారు.  ఇదే సంస్థ కాళేశ్వరం పనుల కాంట్రాక్ట్ కు ఎంతకు టెండర్ వేసింది., జూరాల పవర్ హవుస్ కాంట్రాక్ట్ పనుల్లో ఎంతకు టెండర్ వేసిందో తెలియంది కాదన్నారు. మరి ఇక్కడ మన పనుల్లో ఇప్పుడు తక్కువకు టెండర్ వేయడం ద్వారా నాసిరకం పనులు చేస్తారా అని అడిగారు. లేక వాళ్లకు వేరే విధంగా లబ్ది చేకూరుస్తారా అని నిలదీశారు.  ఎందుకీ కక్కుర్తి రాజకీయాలు అని అన్నారు.  ప్రాజెక్టు భద్రతతో, కోట్లాది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారా అని అన్నారు. రెండున్నర ఏళ్లలో పోగొట్టిన విద్యుత్ ఉత్పత్తి నష్టమే ఐదారువేల కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులే అంటున్నారన్నారు.  ఏడాదిలో రైతులకు పోయే పంట నష్టం ఇంకెంత ఉంటుందోనన్నారు. 



పవర్ హవుస్ పనుల పూర్తి గడువును 28నెలలనుంచి 58నెలలకు ఎందుకు పెంచారన్నారు.  30నెలలు పెంచడం ద్వారా రెండున్నరేళ్ల విద్యుత్ ఉత్పత్తిని పోగొట్టారన్నారు.  దానివల్ల రాష్ట్రానికి ఐదారు వేల కోట్ల నష్టం చేశారని ఆరోపించారు. రూ.750కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటున్నారు కాని వాస్తవంగా రూ.7,500కోట్ల నష్టం చేశారు. పదిరెట్లు నష్టం చేస్తూ, ఆదా చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
తాము  జీర్ణించుకోలేనంత మీరేమీ ఆదా చేయలేదన్నారు. కోట్లాది ప్రజలకు, రాష్ట్రానికి మీరు చేస్తున్న నష్టాన్నే మేము జీర్ణించుకోలేక పోతున్నామని చెప్పారు.‘బీహార్ ఆఫ్ సౌత్’ అని ఆంధ్రప్రదేశ్ ను సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. ‘గవర్నమెంట్ టెర్రరిజం’ తట్టుకోలేమని ప్రముఖ పారిశ్రామిక వేత్త అన్నారు. జాతీయ పత్రికల ఎడిటోరియల్స్ అన్నీ వైసిపి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టను వైసిపి ప్రభుత్వం దిగజార్చిందన్నారు. ఇష్టానుసారం చేయడానికి రాష్ట్రం మీ జాగీరు కాదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి అనేది గుర్తుంచుకోవాలన్నారు.పిపిఏలపై వైసిపి నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేశారు. పిపిఏలను రద్దు చేస్తూ వైసిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని హైకోర్టు కొట్టేసింది. టిడిపి ప్రభుత్వం 5ఏళ్ల పాలనలో ఏ జీవోను కోర్టులు కొట్టేయలేదు, అలాంటిది ఇప్పుడు 4నెలల్లోనే వైసిపి ప్రభుత్వ జీవోను కోర్టు కొట్టేయడం వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: