ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదవ తరగతి ప్రశ్నపత్రంలో భారీ మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు పదవ తరగతిలో ఉన్నటువంటి 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ప్రశ్నపత్రంలోనే బిట్ పేపర్ ను కలిపేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే ఇంటర్నల్ మార్కుల వలన లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు చాలా కాలం నుండి వినిపిస్తున్నాయి. 
 
నిన్న సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. బిట్ పేపర్ ను కొన్ని చోట్ల చూచిరాతలుగా మారుస్తున్నారని ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పదవ తరగతి పరీక్షల్లో పేపర్-1 50 మార్కులకు, పేపర్-2 50 మార్కులకు ఉంటుంది. ఐదు పరీక్షలకు రెండేసి పేపర్ల చొప్పున, హిందీ పరీక్షకు మాత్రం ఒకే పేపర్ ఉంటుంది. పరీక్షకు అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తారు. 
 
ప్రశ్నపత్రం చదివేందుకు 10 నిమిషాలు, పరీక్ష పూర్తయిన తరువాత సమాధానాలు సరిచూసుకోవటానికి మరో 5 నిమిషాలు ఇస్తారు. విద్యార్థులు సమాధానాలు రాయటానికి 18 పేజీలతో కూడిన బుక్ లెట్ ఇవ్వనున్నారు. రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు సాధిస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లుగా ప్రకటిస్తారు. 5 వ్యాసరూప ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. 8 లఘు ప్రశ్నలు 8 మార్కులకు ఉంటాయి. 8 తేలికైన ప్రశ్నలు 8 మార్కులకు ఉంటాయి. 12 సూక్ష్మ లఘు ప్రశ్నలు 6 మార్కులకు ఉంటాయి. 
 
ప్రశ్నపత్రాన్ని విద్యార్థుల విజ్ఞానం పరీక్షించే విధంగా రూపొందిస్తున్నామని మంత్రి అన్నారు. ఒక మార్కు ప్రశ్నలకు ఒక వాక్యంలో, రెండు మార్కుల ప్రశ్నలకు రెండు, మూడు వాక్యాలలో, వ్యాసరూప ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో విధ్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ మార్పుల వలన కాపీయింగ్ కు ఆస్కారం ఉండదని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: