ఏపీలో కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది. సీఎంగా తొలిసారి అధికార పీఠం అధిరోహించిన జగన్....చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళుతున్నారు. పాలనలో అనుభవం లేకపోయిన...అన్ని పరిస్థితులని అవగాహన చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇక జగన్ కు తోడుగా మంత్రులు కూడా బాగానే రాణిస్తున్నారు. అయితే తొలిసారి మంత్రులైన కొందరు కొంచెం తడబడుతుంటే...అనుభవం ఉన్న మంత్రులు మాత్రం పాలనపై పట్టు సాధించుకున్నారు.


అలా పట్టు సాధించిన సీనియర్ మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ కూడా ఉన్నారు. గతంలో వైఎస్ క్యాబినెట్ లో చేసిన అనుభవం గల మోపిదేవి...జగన్ క్యాబినెట్ లో మత్స్య, పశు సంవర్ధక, మార్కెట్ గిడ్డంగుల శాఖ బాధ్యతలని సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన...జగన్ కు అన్ని సమయాల్లో అండగా ఉండటం వలన క్యాబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవి పొందిన ఆయన..తన శాఖలపై మంచి పట్టు సాధించారు.


మత్స్యకార సామాజికవర్గానికి చెందిన నేతగా మోపిదేవి…జగన్ నేతృత్వంలో మత్స్యకారులకు ఏటా రూ. 10వేలు సాయం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కే ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కొత్త మార్కెట్ యార్డులు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అధికార నేతగా ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.


మొన్న కృష్ణా నదికి వరదల వచ్చిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అలాగే వరదలపై టీడీపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. మొత్తం మీద అనుభవం గల మంత్రిగా మోపిదేవి సత్తా చాటుతున్నారు. అయితే కీల‌క‌మైన గుంటూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం త‌గ‌బ‌డుతున్న‌ట్టే చెప్పాలి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న వ‌రుస‌గా టీడీపీ అభ్య‌ర్థి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ చేతిలో ఓడిపోతున్నారు.


నియోజ‌క‌వ‌ర్గంలో మోపిదేవి మీద కొన్ని అంశాల నేప‌థ్యంలో వ్య‌తిరేక‌త రావ‌డంతోనే ఆయ‌న వ‌రుస‌గా ఓడిపోతున్నారు. ఇక కీల‌క‌మైన గుంటూరు జిల్లా రాజ‌కీయ‌ల‌ను ఓ మంత్రిగా ఉండి కంట్రోల్ చేసే విష‌యంలోనూ మోపిదేవికి మైన‌స్ మార్కులే ప‌డుతున్నాయి. ఈ జిల్లాలో పార్టీ ప‌టిష్ట‌త కోసం మంత్రిగా ఆయ‌న మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: