తెలంగాణలో హుజూర్‌న‌గర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయిపోయింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి వలస వెళ్లి పోతున్నారు. చివరకు బాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నామా నాగేశ్వరరావు లాంటి వాళ్లు సైతం టిఆర్ఎస్ లోకి వెళ్లి ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు మాత్రమే ఇప్పుడు ఆ పార్టీకి మిగిలారు.


పార్టీ తరపున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కూడా లేకపోవడంతో ఏప్రిల్లో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో సైతం టిడిపి పోటీకి దూరంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించింది. అలాంటి టిడిపి ఇప్పుడు హుజూర్‌న‌గర్ లో ఎందుకు ? పోటీ చేస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అక్కడ ద్వితీయశ్రేణి నాయకులు మినహా ఎవరు మిగలడం లేదు. ఈ క్రమంలోనే పార్టీకి కాస్తో కూస్తో పట్టుగా ఉన్న కొందరు నేతలు... ఎట్టిపరిస్థితుల్లోనూ హుజూర్‌న‌గర్ లో పోటీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన నల్లగొండ పార్లమెంట్ స్థానానికి చెందిన నేతలతో సమావేశమై ఆదివారం పార్టీ అభ్యర్థిని ప్రకటించారు.


గతంలో హుజూర్‌న‌గర్ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన చావా కిరణ్మయి ఇక్కడ టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండాలి అంటే ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికలతోపాటు... ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లాలోని బాన్స్‌వాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అంతిమంగా టిఆర్ఎస్ లాభపడింది. ఈ విషయాన్ని కొందరు టిడిపి నేతలు ఇప్పుడు ప్రస్తావనకు తెస్తున్నారు. 2009 ఎన్నికల్లో బాన్సువాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు.


ఆ ఎన్నిక‌ల‌లో టీడీపీ పోటీ చేయలేదు. తాము తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తాం అని టిడిపి ప్రకటన చేసింది. ఆ ఎన్నికల్లో పోచారం కు 83 వేల ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 33 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. తాము పోటీకి దూరంగా ఉన్న కారణంగానే కాంగ్రెస్‌కు గణనీయమైన ఓట్లు వచ్చినట్టు ఆనాడు టిడిపి నాయకత్వం అభిప్రాయపడింది. ఇలా పోటీకి దూరంగా ఉండడంతో పాటు... గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలా మంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు అన్న సందేహాలు కూడా ఉన్నాయి.


ఈ క్రమంలోనే టిడిపి అభిమానం ఓటర్లు ఎక్కువగా వున్న హుజూర్‌న‌గర్ లో పోటీ చేసి తమ బలం చూపించాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యి అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే బలంగా ఉన్న టిఆర్ఎస్... కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీ ఇచ్చి టిడిపి ఇక్కడ ఎంతవరకు ఓట్లు సాధిస్తుందా ? అన్నది సందేహం గానే ఉంది. కనీసం బిజెపి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే ఎక్కడ టిడిపి సంచలనం క్రియేట్ చేసినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: