రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు మాసాలు పూర్త‌య్యాయి. మే 30న ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణం చేశారు.  ఆత‌ర్వాత వారంలోనే మంత్రుల‌ను తీసుకున్నారు. ఇలా చూసుకుంటే.. సెప్టెంబ‌రు 30కే జ‌గ‌న్‌కు పాల‌నా ప‌రంగా నాలుగు మాసాలు ముగిశాయి. సీఎంగా ప్ర‌మాణం చేసిన స‌మ‌యంలో త‌న‌కు ఆరుమాసాల స‌మ‌యం కావాల‌ని ఆయ‌న కోరారు. ఆ రుమాసాల్లో రాష్ట్రంలో ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్టు ఆరు మాసాలు ముగియడానికి కేవ‌లం 55 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు సాధించింది ఏంటి?  సాధించాల్సింది ఏంటి అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.


ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే.. జ‌గ‌న్ రాష్ట్ర‌స్థాయిలో సాధించినవి బాగానే ఉన్నాయి. గ్రామ స‌చివాల‌యాల ఏర్పాటు, ఉద్యోగ క‌ల్ప‌న‌, పింఛ‌న్ల పెంపు, పాఠ‌శాల‌ల సుంద‌రీక‌ర‌ణ‌, మద్యం విధానంలో స‌మూల మార్పు.. ఇలా కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. గ్రామ వ‌లంటీర్ల వ్య‌వ‌స్త ద్వారా రేష‌న్ స‌హా ప్ర‌భుత్వ ప‌థ‌కా ల‌ను ప్ర‌జ‌ల‌కు ఇంటి ముందుకే తీసుకు వెళ్లేందుకు జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నం.. దేశంలో ఎవ‌రూ చేయ‌లేద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఇక‌, ఒకే ద‌ఫా 4 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇవ్వ‌డం కూడా ఈ నాలుగు మాసాల్లో జ‌గ‌న్ స‌ర్కారు సాధించిన రికార్డు గానే చెప్పాలి.


అయితే, జ‌గ‌న్ చేతిలో ఉన్న‌వి.. రాష్ట్ర‌ప‌రిధిలోని అంశారు. కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని సాధిం చారా?  పోల‌వ‌రానికి నిధులు కానీ, అమ‌రావ‌తికి నిధులు కానీ, ఉద్యోగుల పంపిణీ వంటి కీల‌క విష‌యంలో కానీ, పీపీఏల రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో కానీ, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో కానీ, రేవుల నిర్మాణం, వాటికి నిధులు వంటి కీల‌క విష‌యాల్లో కేంద్రాన్ని ఈ నాలుగు మాసాల్లో ఒప్పించి తీసుకు వ‌చ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా? అనేది చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి.


ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఫ‌లానాది సాధించాం.. అని జ‌గ‌న్ కానీ, ఆయ‌న ప‌రివారం కానీ చెప్పే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాష్ట్రంలో చేయాల్సింది చేసినా.. కేంద్రంపై ఈ రెండు నెల‌లు దృష్టి పెట్టి.. అక్క‌డి నుంచి రావాల్సిన వాటిని రాబ‌డితేనే.. ఆరు మాసాల్లో స‌క్సెస్ రేటు అందుకునేది.. అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి జ‌గ‌న్ వ్యూహం ఏంటో. ఆయ‌న ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: