ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరును వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. ఆ క్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి  జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నల వర్షం హాట్ టాపికైంది. టిఎస్ ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడ ప్రెస్-క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


ఉద్యమం ఉదృతంగా జరిగే రోజుల్లో టిఎస్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని చంద్రకుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ది నోరా? మోరీనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవ్లరకు నెలకు ₹ 50000/- జీతం ఇస్తున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ డ్రైవర్ కు, కండక్టర్ కు అంత మొత్తం ఇస్తున్నారో చూపించాలని చంద్రకుమార్ డిమాండ్ చేశారు.


టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది కనుక ప్రైవేట్ పరం చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని, మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా! అని చంద్రకుమార్ ప్రశ్నించారు. యూనియన్లు అవసరం లేదనడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్నికలు, సకలజనుల సమ్మె సమయంలో టిఎస్ ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఓసారి గుర్తుకు తెచ్చు కోవాలని సూచించారు. 
ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని, వారి జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సమానం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ రోజున మాట్లాడిన మాటేంటి? ఈరోజున మాట్లాడుతున్న మాటేంటి? అని చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.


ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన ఆల్ పార్టీ మీటింగ్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: