ఈ మధ్య కాలంలో రోజురోజుకు సైబర్ మోసాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రజలకు ఈ నేరాల గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. అమాయక ప్రజలు టార్గెట్ గా ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఏటీఎంలే లక్ష్యంగా మోసాలు చేస్తున్న ఒక మోసగాడిని అరెస్ట్ చేశారు. 
 
తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చింతల సురేశ్ బాబు అమాయక ప్రజలు టార్గెట్ గా ఏటీఎంల దగ్గర మోసాలు చేసేవాడు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిస అయిన సురేశ్ ఏటీఎం కేంద్రాలకు వచ్చే వారికి సహాయం చేస్తానని చెప్పి నమ్మించేవాడు. ఇలా సురేశ్ 6 ఏటీఎం కేంద్రాల దగ్గర 16 నేరాలు చేశాడు. మరో ఏటీఎం సెంటర్ దగ్గర మోసానికి పాల్పడే ప్రయత్నాల్లో ఉండగా సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఏటీఎం కేంద్రాలకు వెళ్లిన ప్రజలు ఎట్టి పరిస్థితులలోను కార్డును ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఏటీఎం పిన్ మరియు ఏటీఎంకు సంబంధించిన ఇతర వివరాలను ఎట్టి పరిస్థితులలోను అపరిచితులకు చెప్పకూడదు. ఏటీఎం ఉపయోగించటం తెలియని పక్షంలో తోడుగా మన కుటుంబ సభ్యులను లేదా నమ్మకంగా ఉండే స్నేహితులను తీసుకొనివెళ్లటం మంచిది. ఏటీఎంలో లావాదేవీలు పూర్తి చేసిన తరువాత వచ్చే రిసిప్ట్ ను అక్కడే పారేయకుండా వెంట తీసుకెళ్లటం మంచిది. 
 
ఎవరైనా బ్యాంకు అధికారులమని చెప్పి ఏటీఎం కార్డు మరియు ఓటీపీ వివరాలు అడిగితే అలాంటివాళ్లు మోసగాళ్లని గుర్తించాలి. అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తే సంబంధిత బ్యాంకు శాఖకు, సమీపంలోని పోలీస్ స్టేషన్ లో తెలియజేయటం ఉత్తమం అని చెప్పవచ్చు. ఏటీఎంకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లి పరిష్కరించుకోవటం మంచిది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: