ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కదిపారు. ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఏ ప్రాంతాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అధ్యయనానికే నిపుణుల కమిటీని నియమించామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తుందని తెలిపారు.


రాజధాని, రాష్ట్ర ప్రాజెక్టుల పై ఏర్పాటు చేసిన నిపుణుల కమీటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. అభివృద్ధి కేవలం రాజధానికే పరిమితం కాదని, ప్రాంతం, కులానికి మాత్రమే పరిమితం కాదన్నారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల్ని, అన్ని వర్గాల్ని సమానంగా చూస్తుందని, రాజధాని రైతులు సీఎం జగన్ తో పాటు తనను కూడా కలిశారని బొత్స అన్నారు.


రాజధాని రైతులకు చెల్లించాల్సిన 148 కోట్ల కౌలు బకాయిలను వారి ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. త్వరలోనే లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లు ఇస్తామన్నారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కొందరు, అమరావతిలోనే కొనసాగించాలని మరికొందరు, ఉత్తరాంధ్రలో పెట్టాలని ఇంకొందరు డిమాండు చేస్తున్నారని, వీటినీ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలన్నింటిపైనా కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.


చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను ఏమాత్రం పట్టించుకోలేదని బొత్స విమర్శించారు. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయమున్న ప్రాంతం వర్షం పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముందన్నారు బొత్స. ఇక్కడ ఒక భవనం నిర్మించాలంటే 100 అడుగుల లోతులో పునాదులు తీయాల్సి వస్తోంది. ఖర్చు చాలా ఎక్కువ. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమైంది. అవినీతి చోటుచేసుకుంది..అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స. చంద్రబాబు సర్కారు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా.. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పి.నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి ఆయన సిఫార్సుతో అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: