తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ నెల 21వ తేదీన జరగబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ఉప ఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. 
 
తెలుగుదేశం, బీజేపీ పార్టీలు భారీ స్థాయిలో ఓట్లు సాధించాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీగా సానుకూలత ఉండటంతో పాటు సంక్షేమ పథకాల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలతో బలోపేతం కావటం బలాలుగా మారగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి అందరినీ కలుపుకొనిపోరనే ప్రచారం బాగా వినిపించటం, పాత మరియు కొత్త నేతల మధ్య సమన్వయ లోపం బలహీనతలుగా మారాయని చెప్పవచ్చు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ గతంలో చేసిన అభివృద్ధి, మహిళా అభ్యర్థి పోటీ చేస్తూ ఉండటం బలాలుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున వలసలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి బలహీనతలుగా మారాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే విజయావకాశాలు ఎక్కువగా ఉండగా టీడీపీ, బీజేపీ అభ్యర్థుల వలన ఏ పార్టీకి నష్టం అనే అంశం గురించి చర్చ కూడా జరుగుతోంది. 
 
టీడీపీ, బీజేపీ అభ్యర్థులు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. రాజకీయవర్గాలు మాత్రం టీడీపీ, బీజేపీ పోటీ వలన కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని ఉత్తమ్ సతీమణి పద్మావతి ప్రచారం చేస్తోంది. ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగనుండగా 24వ తేదీన ఫలితం వెలువడనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: